నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ పట్టణం కోటర్ముర్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గ్రామంలోని తిరుమల కాలనీలో కోట ముత్తన్న, నాగమణి దంపతులు నివాసముంటున్నారు. ఇద్దరూ ప్రభుత్వోద్యోగులు కాగా... వీరికి ఒక కొడుకు(14), ఒక కూతురు(4) ఉన్నారు. సిరికొండ మండలం న్యావానందిలో నాగమణి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లిలో ముత్తన్న ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఎప్పుడూ కొట్టేవాడు...
భార్యపై అనుమానంతో ముత్తన్న ఎప్పుడూ చితకబాదేవాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇదివరకు ఒకసారి ఇలాగే కొడితే నాగమణి పుట్టింటికి వెళ్లగా... పెద్దలు ఒప్పించి పంపించారు. అయినా ముత్తన్న తీరుమారలేదు. ఈమధ్యనే మళ్ళీ ఇంట్లో గొడవ జరగ్గా నాగమణి పుట్టింటికి వెళ్ళింది. పెద్దలు సముదాయించగా.. సోమవారం రోజు తిరిగి వచ్చింది.
దంపతులిద్దరికీ రాత్రి మళ్లీ గొడవ జరిగింది. ఉదయం చూసేసరికి నాగమణి చనిపోయివుంది. హార్ట్ఎటాక్తో తన భార్య చనిపోయిందని కాలనీవాసులకు ముత్తన్న తెలిపాడు. పోలీసులు వచ్చి పరీక్షించగా... నాగమణి ఒళ్ళంతా కమిలిపోయి ఉండటాన్ని గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.