నిజామాబాద్ జిల్లాకు చెందిన సంసముద్దీన్ బాక్సింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించినా, కుటుంబ ఆర్థిక స్థితిగతుల కారణంగా ప్రపంచ విజేతగా నిలవాలనే తన కలను మధ్యలోనే వదిలేశారు. కసితో తన కుమారులను బాక్సింగ్‌లో దిగ్గజులుగా తీర్చిదిద్దారు. కుమారులనే కాదు..ఉచిత శిక్షణతో ఎందర్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బాక్సర్లుగా మార్చారు.
సంసముద్దీన్ 13 ఏళ్ల వయసులోనే పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలో విజయం సాధించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తర్వాత జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనలేక, రాష్ట్రస్థాయి పోటీలకు పరిమితమయ్యారు. కొన్నాళ్లకు ఆ ప్రస్థానాన్ని కూడా కొనసాగించలేక ఓ వెల్డింగ్ కార్ఖానాలో పనికి చేరారు. ఆ తర్వాత సైన్యంలో చేరారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక పెళ్లి, పిల్లలతో కుటుంబ భారం పెరగడంతో నిజామాబాద్‌లో టీ దుకాణం, సైకిల్ స్టాండు తెరిచారు.
అన్ని పనులు చేస్తున్నా, కుటుంబ బాధ్యతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తనకు ప్రాణ సమానమైన బాక్సింగ్‌ను మాత్రం ఆయన వదల్లేదు. తను నెరవేర్చుకోలేకపోయిన కలను శిష్యుల రూపంలో సాకారం చేసుకోవాలనుకున్నారు. శిక్షకుడిగా మారి తన ఆరుగురు కుమారుల్లో ఐదుగురికి తర్ఫీదు ఇచ్చి బాక్సింగ్ రింగ్‌లోకి దింపారు. తండ్రి కఠోర శిక్షణలో రాటుదేలిన వారిలో ఇద్దరు అంతర్జాతీయ స్థాయి, ముగ్గురు జాతీయ స్థాయి పోటీల్లో రాణించారు.
వారిలో ఒకరైన ఎత్తేసాముద్దీన్ 2014-16 మధ్య కాలంలో నాలుగు సార్లు అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. ఐదో కుమారుడు హుసాముద్దీన్ 2018లో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించారు. ప్రస్తుతం జర్మనీలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ బాక్సింగ్ పోటీల్లో సెమీ ఫైనల్ వరకు వెళ్లారు. ‘తన కుమారుల్లో ముగ్గురు సైన్యంలో జేసీవోలుగా పనిచేస్తున్నారని, అందరూ స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగం సాధించారని’ సంసముద్దీన్ తెలిపారు. మరో కుమారుడు స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం పొందాడని, మరో కుమారుడు హైదరాబాద్‌లో బాక్సింగ్ కోచ్‌గా ఉన్నాడని వివరించారు.
క్రమశిక్షణే ఫీజు
చిన్నారుల నుంచి కళాశాల విద్యార్థుల వరకు ఈయన వద్ద శిక్షణకు వస్తుంటారు. వారి నుంచి ఆయన తీసుకునే ఫీజు ‘క్రమశిక్షణ’ మాత్రమే. ఏడు పదుల వయసులోనూ చలి, ఎండలను లెక్కచేయకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఇస్తారు. దేశంలో ఎక్కడ పోటీలు జరిగినా తన శిష్యులను తానే స్వయంగా తీసుకెళ్తారు. రింగ్‌లోకి దిగే వారి తరఫున జట్టు కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరిస్తుంటారు. కరోనా కాలంలోనూ మూడు నెలలు మినహా నిజామాబాద్ నగర శివారులోని మైదానంలో భౌతికదూరం పాటిస్తూ శిక్షణ శిబిరాన్ని కొనసాగించారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న వారు పదుల సంఖ్యలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. దేశంలోని మహిళా స్టార్ బాక్సర్లలో ఒకరైన నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్‌కు కూడా తొలి గురువు ఈయనే కావడం గమనార్హం.
బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటులో పాత్ర
సంసముద్దీన్ మూడు దశాబ్దాల కిందట నిజామాబాద్ బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు.నేటికి కార్యదర్శిగా కొనసాగుతున్నారు.