నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ గంగపుత్రులపై గ్రామ బహిష్కరణ ఘటనలో గ్రామ అభివృద్ధి కమీటీ వెనుకకు తగ్గింది. గ్రామాభివృద్ధి కమిటీ చేస్తున్న బెదిరింపులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా... ఆర్డీవో, డీఎస్పీ, తహసీల్దార్, ఎస్సై గ్రామానికి వెళ్లి పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కమిటీ సిబ్బందిని మందలించారు. గంగపుత్రులపై గ్రామ బహిష్కరణ ఎత్తివేసినట్టు గ్రామ చావిడి వద్ద మైక్ ద్వారా ప్రకటింపజేశారు.
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలాంటి పరిమాణాలు ఉంటాయో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన జిల్లా గంగపుత్ర చైతన్య సమితిని పిప్రి గ్రామ మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.