రెండు పడక గదుల ఇళ్లు... తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెపట్టిన పథకం. కాంగ్రెస్ హయాంలోని ఇందిరమ్మ ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని భావించిన సర్కారు.. స్వయంగా ఇళ్లు నిర్మించి పేదలకు అప్పగించే బాధ్యత తీసుకుంది. నిరుపేదలు, ఇళ్లులేని వారిని గుర్తించి అప్పగిస్తామని ప్రకటించింది. లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉండటం, ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల నిర్మించిన ఇళ్లు వినియోగంలోకి రాలేకపోతున్నాయి.
420 ఇళ్లు
నిజామాబాద్ నగర శివారులోని నాగారంలో రెండు పడక గదుల ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించడంలో జాప్యం జరుగుతుండటంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి.నాగారంలోని నీరుగొండ హనుమాన్ ఆలయం సమీపంలో జీప్లస్ 2 స్థాయిలో మొత్తం 35 భవనాలు నిర్మించారు. ఒక్కో భవనంలో 12 కుటుంబాలుండేలా తీర్చిదిద్దారు. 420 మంది లబ్ధిదారుల కోసం ఆ ఇళ్లు కట్టించారు. పనులు పూర్తై 6 నెలలు దాటినా లబ్ధిదారులకు అప్పగించలేదు. గత నెలలో పేదల నుంచి నిజామాబాద్ నగరపాలకసంస్థ పరిధిలో దరఖాస్తులను ఆహ్వానించారు. కాని లబ్ధిదారుల ఎంపిక మాత్రం చేయలేదు.
మందుబాబులకు అడ్డాగా
ఫలితంగా ఆకతాయిలు ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. కిటికీల అద్దాలు, తలుపుల విరగొట్టారు. విద్యుత్ స్విచ్ బోర్డులు, ఇతర పరికరాలు పాడుచేశారు. సీసీ కెమెరాలను అపహరించారు. నీటి సరఫరా పైపులు, వీధి దీపాలను పగలగొట్టారు. నగరానికి దూరంగా ఉండటం వల్ల మందుబాబులు తాగుడుకు అడ్డాగా మర్చుకుంటున్నారు. ఒక్కో ఇంటికి 5 లక్షలకుపైగా వెచ్చించి ప్రభుత్వం నిర్మించింది. లబ్ధిదారులకు అప్పగించక ఇళ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఇంకొన్నాళ్లు ఆగితే వాటి స్వరూపమే పూర్తిగా మారిపోయేలా ఉంది. ఇప్పటికైనా లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పగిస్తే పేదలకు నీడ దొరకనుంది.
ఇదీ చదవండి: ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే కావాలి : సీఎం కేసీఆర్