నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో మత్స్యకార కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయటం పట్ల గంగపుత్ర జిల్లా చైతన్య సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మూర్ తహసీల్దార్, ఆర్డీఓ, డీఎస్పీ, ఎస్సైలకు వీడీసీ ఆగడాలపై వినతి పత్రాలు అందించింది. పిప్రి గ్రామంలోని చెరువులో ఇటీవలే చేపలు పట్టిన గంగపుత్రులను గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపులకు గురిచేస్తోందని చైతన్య సమితి మండిపడింది. చెరువులో పట్టిన చేపలు గ్రామంలో మాత్రమే అమ్ముకోవాలని... ఇతర చోట్లకు వెళ్లకూడదని వీడీసీ హుకూం జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
గ్రామ అభివృద్ధి కమిటీ చెప్పిన ధరలకే చేపలు అమ్మాలని గంగపుత్రులను ఒత్తిడి చేస్తున్నారని మత్స్య సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నట్లు... అవి కట్టకపోతే గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు ఆరోపించారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వెంటనే తమ ఆగడాలను ఆపకపోతే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అల్గోట్ రమేశ్, ముఖ్య సలహాదారు ఉట్నూర్ బాలన్న, జిల్లా ముఖ్య సలహాదారు పల్లికొండ నర్సన్న, ఉపాధ్యక్షులు తిమ్మాపూర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.