Custom Milling Rice Issue in Nizamabad : సీఎంఆర్ కోటాలో తిరిగివ్వని ఈ మిల్లుల్లో అధికారులు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు భారీగా పక్కదారి పట్టించినట్లు వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.70 కోట్ల విలువైన 33,328 టన్నుల ధాన్యానికి లెక్కలు లేవని పౌర సరఫరాల శాఖ తాజాగా గుర్తించింది. ఇదంతా 2021-22 యాసంగి, 2022-23 వానాకాలం సీజన్లకు సంబంధించిన బకాయిలుగా తేల్చింది. జిల్లాలోని మూడు మిల్లుల్లో ఈ ధాన్యం దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా ఈ వ్యవహారంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యుల పేరిట ఉన్న మిల్లులు కూడా ఉన్నాయని చెబుతుండటం గమనార్హం. సీఎంఆర్ కోటా తిరిగివ్వని ఈ మిల్లుల్లో అధికారులు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
యాసంగి కోటాకు జరిమానా విధించినా: 2021-22 సంవత్సరంలో యాసంగిలో షకీల్ కుటుంబసభ్యుల పేరిట ఉన్న మిల్లులకు 26,732 టన్నుల ధాన్యం ఇచ్చారు. మిల్లులు సరిగ్గా నడవటం లేదంటూ వాటి యాజమాన్యాలు మొత్తం ధాన్యాన్ని బోధన్‌లోని అర్కం, వర్నిలోని ఎఫ్‌టీఎఫ్, ఎడపల్లిలోని ఏఆర్ ఇండస్ట్రీస్ మిల్లులకు మళ్లిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖకు లిఖితపూర్వకంగా ఇచ్చింది. ధాన్యానికి బియ్యం ఇచ్చే బాధ్యత పూర్తిగా తామే తీసుకుంటామని అందులో రాసిచ్చాయి. ఇందులో ఏఆర్ ఇండస్ట్రీస్ మినహా మిగతా రెండు యాజమాన్యాలు గడువు ముగిసినా 14,500 టన్నుల ధాన్యానికి బియ్యం ఇవ్వలేదు.
Bodan Commercial Taxes Department Scam : బోధన్ వాణిజ్యపన్నుల శాఖ కుంభకోణంలో.. మరో నలుగురు అరెస్ట్
RS.70 Crore Worth Scam by Rice Millers in NIzamabad : దీంతో ఇచ్చిన మొత్తానికి 25 శాతం బియ్యాన్ని అదనంగా ఇచ్చేలా సదరు నేత సంబంధీకుల మిల్లులకు పౌర సరఫరాల శాఖ జరిమానా విధించింది. దీని విలువ రూ.9.5 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో కేవలం 5 శాతం జరిమానాను ఇప్పటి వరకు జమ చేశారంటున్నారు. మిగతా బియ్యం కోసం సదరు రెండు మిల్లుల వద్దకు వెళ్తే తమకు సదరు మిల్లుల నుంచి పత్రంలో పేర్కొన్న మేరకు ధాన్యం సరఫరా కాలేదంటున్నారు. తమతో ముందస్తుగా పత్రం రాయించుకొని తర్వాత ధాన్యం పంపలేదంటున్నారని అధికారులకు చెబుతున్నారు.
వానాకాలంలోనూ పక్కదారి: 2022-23 వానాకాలంలో మాజీ ఎమ్మెల్యేకు చెందిన మిల్లులకు మరో 24 వేల టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. దీనికి ఈ నెల 31లోగా సీఎంఆర్ పూర్తి చేయాలి. ఇప్పటి వరకు అతి స్వల్పంగానే బియ్యాన్ని ఇచ్చారు. సదరు యాజమాన్యాలు ఈ కోటా నుంచి కూడా పెగడాపల్లిలోని అబ్దుల్ మిల్లుకు 8,469 టన్నులు, మిగతా మొత్తం బోధన్‌లోని అర్కం మిల్లుకు మళ్లించి వారే సీఎంఆర్ పూర్తి చేసేలా పత్రాలు రాసుకున్నారు.
ఇక్కడ కూడా భారీగా బకాయి పేరుకుపోవటంతో పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి చంద్రప్రకాష్, జిల్లా మేనేజర్ జగదీశ్, తనిఖీ విభాగం సభ్యులతో కలిసి ఆయా మిల్లులకు అనుబంధంగా ఉన్న గోదాముల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత యాజమాన్యాలకు పైన పేర్కొన్న రెండు సీజన్లకు కలిపి 50,732 టన్నుల ధాన్యం అప్పగించగా, ఇంకా 33,328 టన్నుల మేర బకాయి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వారి గోదాముల్లో ఇంత మేర ధాన్యం నిలువలు లేవని చెబుతున్నారు. మరిన్ని తనిఖీలు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెబుతున్నారు.
భూ కుంభకోణంలో 8 మంది ఐఏఎస్‌లు.. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగిన వైనం