కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 4న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌లో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా రైతాంగాన్ని కోరారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాత కూలీగా మారే అవకాశాలు ఉన్నాయని మోహన్ రెడ్డి ఆరోపించారు. మూడు ప్రధానమైన డిమాండ్లతో మహాధర్నా నిర్వహిస్తున్నామని.. అవి సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
ప్రధానమైన 3 డిమాండ్లు:
1. సన్నరకం వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్భలంతో వేసిన రైతు దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయినందున వరి క్వింటాలుకు రూ. 2500 చెల్లించి, ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
2. మొక్కజొన్న విషయంలో ప్రభుత్వం అవలంభించిన విధానం చాలా దారుణంగా ఉందని జిల్లా రైతాంగం అతి తక్కువ ధరకు మొక్కజొన్న పంటను దళారులకు అమ్ముకున్న తరువాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అందుకే రైతు నష్టపోయిన ధరను ప్రభుత్వమే చెల్లించాలి.
3. పసుపు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పక్క రాష్ట్రమైన ఏపీలాగా రైతు బోనస్ ప్రకటించి పసుపు బోర్డు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి.
ఈ డిమాండ్లతో ఆర్మూర్‌లో మహా ధర్నా నిర్వహిస్తున్నామని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పత్రికా సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శులు విక్కి యాదవ్, ప్రీతం, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతుల మహాధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గృహనిర్బంధం