bodhan scam news : ఐదేళ్లు.. రూ.280 కోట్లు. బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కేంద్రంగా శివరాజ్ ముఠా చేసిన దోపిడీ మొత్తం ఇది. ప్రభుత్వ సిబ్బందితో కలిసి ఆ ముఠా.. ఖజానాకు కన్నం వేసినట్లు నిర్ధారణ అయినప్పటికీ ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంత? అనేది ఇంతకాలం చిక్కుముడిగానే మిగిలింది. రూ.500 కోట్ల వరకూ ఉండవచ్చని మొదట్లో భావించినప్పటికీ సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చింది.
బోధన్ కేంద్రంగా జరిగిన వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012-17 మధ్య కాలంలో జరిగిన ఈ వ్యవహారంలో నిందితులు ఒకే చలానాను వేర్వేరు వ్యాపార సంస్థల పేర్ల మీద దస్త్రాల్లో నమోదుచేసి, ఖజానాకు భారీగా గండికొట్టారు. ఈ ఉదంతంలో దళారీగా వ్యవహరించిన శివరాజ్, అతని అనుచరులతో పాటు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందినీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2017లో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది.
ఎంతో పకడ్బందీగా.. కుంభకోణం సూత్రధారులు బోధన్ కార్యాలయం పరిధిలోని అన్ని సంస్థలు పన్ను చెల్లించినట్లు కంప్యూటర్లో నమోదు చేశారు. వాటి తాలూకూ డబ్బు మాత్రం ఖజానాలో జమకాలేదు. వాస్తవంగా రాష్ట్రవ్యాప్తంగా వసూలయిన పన్నులన్నీ ఒకే ఖాతాలో జమవుతాయి. దాంతో సీఐడీ అధికారులకు బోధన్ కార్యాలయం నుంచి జమయిన పన్నులను వేరుచేయడం కత్తిమీద సామయింది. ఈ నేపథ్యంలో అసలు ఎంత మేరకు పన్ను ఎగవేతకు గురైందనేది తేల్చే క్రమంలో సీఐడీ అధికారులు..వాణిజ్య పన్నులశాఖ సర్వర్‌కు ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించారు. బోధన్ ఉప కార్యాలయం పరిధిలోని ఎన్ని వాణిజ్య సంస్థలకు ఎంతమేరకు పన్ను విధించారు, అందులో ఆయా సంస్థలు వాస్తవంగా ఎంత పన్ను చెల్లించాయన్నది విశ్లేషించి కొల్లగొట్టిన మొత్తాన్ని నిర్ధారించారు.
మొత్తంగా సంవత్సరానికి రూ.56 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.280 కోట్లు దోపిడీ చేసినట్లు తేల్చారు. అంటే సగటున రోజుకు రూ.15 లక్షలకుపైగానే కొల్లగొట్టారన్నమాట. దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వెల్లడయిన అంశాలు తిరుగులేని సాక్ష్యాలుగా మారుతాయని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘‘పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జరిగిన ఈ దర్యాప్తు ద్వారా వెల్లడైన సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడేలా చేయవచ్చు. కంప్యూటర్లో నమోదయిన అంశాలు కావడంతో న్యాయస్థానం కూడా ఆయా అంశాలను పటిష్టమైన సాక్ష్యంగానే పరిగణిస్తుందనే నమ్మకం ఉందని’’ పేర్కొన్నారు.
కుంభకోణం 5 ఏళ్లు.. దర్యాప్తునకూ ఐదు సంవత్సరాలు.. శివరాజ్ ముఠా 2012 నుంచి 2017 వరకూ ఐదేళ్లపాటు దోపిడీకి పాల్పడింది. దీని దర్యాప్తునకు కూడా సీఐడీకి ఐదేళ్లు పట్టడం గమనార్హం. ఇందులో ఇంకా మిగిలిపోయిన అంశాలపైనా దర్యాప్తు పూర్తిచేసి వీలైనంత త్వరలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.