బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. అంబేడ్కర్, పూలే చెప్పినట్లుగా విజ్ఞానం ఉంటేనే చైతన్యం వస్తుందని వ్యాఖ్యానించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజరేషన్ల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
బీసీలంతా కలిసికట్టుగా పోరాడి 27 శాతం రిజర్వేషన్లు సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కొట్లాడితేనే హక్కులు సాధించవచ్చని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లయినా బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై బీసీ నాయకులు ఒకసారి ఆలోచించాలని సూచించారు. రిజర్వేషన్లు అమలుచేయాలని చట్టాలు చెబుతున్నా.. కేవలం 6 నుంచి 11 శాతమే అమలవుతున్నాయని తల్లోజు ఆచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య, న్యాలం రాజు పాల్గొన్నారు.