Accident Patient Died Suddenly In Hospital : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగి... చికిత్స తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు జనం. దాదాపు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వాసుపత్రికి వెళుతున్నారు. అయితే అక్కడక్కడా ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రులంటే భయం వేసే పరిస్థితి వస్తోంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ మృతి చెందాడు. దీంతో సదరు రోగి బంధువులు వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి పేషెంట్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గాయత్రి నగర్‌కు చెందిన బాలరాజు మే 1వ తేదీన బైక్‌పై వెళ్తుండగా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ ప్రధాన రహదారిపై లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కాలుకు తీవ్రమైన గాయాలు కావడంతో క్షతగాత్రుడు బాలరాజును మొదట కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు బాలరాజుకు చికిత్స ప్రారంభించారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబీకులు : గత రెండు వారాలుగా చికిత్స పొందుతూ బాగానే ఉన్న బాలరాజు... మంగళవారం రాత్రి ఒక్కసారిగా మృతి చెందాడు. వైద్యులు సరైన చికిత్స అందించకపోవడం వల్లే పేషెంట్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పేషెంట్ మృతి చెందాలని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, నిరసన తెలిపారు.
రెండు వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన, కోలుకున్న తర్వాత ఒకసారిగా ఎలా మృతి చెందుతాడని, ఆసుపత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. వైద్యులు సరైన చికిత్స అందించక పోవడంతోనే బాలరాజు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చికిత్స చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రిలో గందరగోళం చెలరేగింది. చివరకు పోలీసులు బాధితులను సముదాయించారు. ఘటనపై విచారణ జరిపేలా ఉన్నతాధికారులతో మాట్లాడతామని ఒప్పించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లేది లేదని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇవీ చదవండి: