Dog Attacks Increases in Nizamabad District: నగరం, పట్టణం, పల్లె ఎక్కడ చూసినా గ్రామసింహాలు గుంపులు గుంపులుగా ఉంటూ వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. బడికి వెళ్లే పిల్లల వెంట పడుతున్నాయి. పనులు ముగించుకొని రాత్రి వేళల్లో ఇళ్లకు చేరేవారు ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం, సాయంత్రం నడక సాగించే వారూ ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులకూ కష్టాలు తప్పడం లేదు.
Dog Attacks Increases in Telangana: నిజామాబాద్ జిల్లాలో వరుస ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్పేట్లో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతి చెందాడు. మూకుమ్మడిగా దాడి చేయడంతో నిస్సహాయ స్థితిలో చూస్తుండగానే పసివాడు ప్రాణాలు వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంకెంతమంది తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి వస్తుందోనన్న ఆందోళన అందరూ వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గడచిన 13 నెలల్లో ఏకంగా 4 వేల 340 మంది కుక్కకాటుకు గురైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది. శునకాలను నియంత్రించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తుండటంతో అమాయకులు ప్రాణాలు వదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కుక్కల దాడిలో గాయపడ్డ వారు నిత్యం 20 నుంచి 25 మంది వైద్యం కోసం వస్తున్నారంటేనే ఏ స్థాయిలో కుక్కల బెడద ఉందో అర్థం చేసుకోవచ్చు.
గ్రామాల్లో వీధి కుక్కల బెడద అధికం: యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకునేవారిలో గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నిజామాబాద్ నగరానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. సాధారణంగా గ్రామాల్లో వీధి కుక్కల బెడద అధికంగా ఉంటుంది. చీకటి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేస్తుంటాయి. కానీ జిల్లా కేంద్రంలోనే వరుస ఘటనలు జరుగుతుండటంపై నగరవాసులు అందోళన చెందుతున్నారు.
గతంలో మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా వీధి కుక్కలను పట్టుకొని వాటికి కుని శస్త్ర చికిత్సలు చేసేవారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ జరగట్లేదు. మొత్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో వీటి సంతతి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శునకాల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామంటూ మూడు నెలల్లో నిజామాబాద్ నగర పాలక సంస్థలో 60కి పైగా ఫిర్యాదులు అందాయి.
అయినా నగర పాలక సంస్థ చేపట్టిన చర్యలు మాత్రం శూన్యమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది స్పందించి మరిన్ని ప్రాణాలు పోకముందే కుక్కలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: