ప్రస్తుతం పిల్లలు పెద్దలకు కాలక్షేపం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో నిర్మల్‌లోని ప్రియదర్శినినగర్‌కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయురాలు మంగ్లారపు వెన్నెల ఇద్దరు కూతుళ్లు నక్షత్ర, నైపుణ్యతో ఇంట్లోనే పలు చైతన్య కార్యక్రమాలను చిత్రీకరిస్తున్నారు. ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం, వంటలు, పండుగలు, ఆన్‌లైన్ క్లాసుల సద్వినియోగం తదితర అంశాలను చిన్నారులచే ఆకట్టుకునేలా వెన్నెల రూపొందిస్తారు. ఆమే స్వయంగా వీడియో చిత్రీకరించి naipunya trending యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు చేరవేస్తూ మన్ననలు అందుకుంటున్నారు.
![](https://assets.eenadu.net/article_img/25ANL403_1.jpg)
ఇంట్లోనే స్టూడియో..
చెప్పే అంశం ప్రజలను ఆకట్టుకోవాలన్నా.. ఆలోచింపజేయాలన్నా ప్రతిదీ నాణ్యంగా, నమ్మకంగా ఉండాలి. యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తున్న వారు ఇంట్లోనే చక్కగా స్టూడియోను తయారు చేస్తున్నారు. చుట్టుపక్క ప్రాంతాల్లోని చక్కని ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో చాలా మంది ఉమ్మడి జిల్లా వాసులు తమలోని ప్రతిభను, కళను జనాలకు చేరవేశారు.
మిద్దె తోట ఇదీ బాట..
ప్రస్తుతం చాలా మందికి పెరటి తోటల మీద ఆసక్తి పెరిగింది. ఇంటి పంట ప్రయోజనాన్ని గుర్తించి కాసింత స్థలమున్నా ఏదో ఒకటి పండిస్తున్నారు. సోన్ మండలం కడ్తాల్‌కు చెందిన కస్తూరి సునీత ఎంఏ బీఈడీ చదివారు. మిద్దె తోట సాగులో నైపుణ్యం ఉంది. సాగులో బోలెడన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఆయుర్వేద, పండ్ల, కూరగాయల, పూల మొక్కలను పెంచుతూ వాటి ‘ఫలాలు’ పొందుతున్నారు. ఆమెకున్న అవగాహనను నలుగురికి పంచేందుకు మిద్దె తోట సాగును భర్త రాజు సహకారంతో వీడియో తీస్తూ simply sanaita ismart thoughts అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. నాటేటప్పుడు వాడే మట్టి మొదలు మొక్క పెరిగే ప్రతి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను సునీత వివరిస్తున్నారు..
![](https://assets.eenadu.net/article_img/25ANL402_2.jpg)
మంచివీ.. అవసరమయ్యేవి..
నిర్మల్ ప్రియదర్శిని నగర్‌కు చెందిన రజని దేవి అనే ఉపాధ్యాయురాలు జనాలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.ఆమె చైతన్య కార్యక్రమాలకు కూతుళ్లే బ్రాండ్ అంబాసిడర్లు. రజని నిర్వహిస్తున్న me and my cutie pies అనే యూట్యూబ్ ఛానల్‌లో సందర్భోచిత అంశాలను ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తున్నారు. చిన్నారులు అక్షర స్ఫూర్తి, అంకుర అప్పగించిన పాత్రల్లో జీవిస్తూ చూపరులను ఆలోచింపజేస్తున్నారు. పర్యావరణ హితంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మట్టి వినాయకులు, పాలిథిన్‌తో అనర్థాలు, సేంద్రియసాగు, యోగా ఆవశ్యం, ఆరోగ్యంపట్ల అప్రమత్తం చేసే అనేక అంశాలను ప్రజలకు చేరవేస్తున్నారు. తాజాగా రైతు నేపథ్యంలో ఆ చిన్నారులతో చిత్రీకరిస్తున్న లఘుచిత్రం సందేశాత్మకంగా ఉంటుందని రజనిదేవి చెప్పారు.
![](https://assets.eenadu.net/article_img/25ANL404_3.jpg)
![](https://assets.eenadu.net/article_img/25ANL405_2.jpg)
మంచిర్యాలకు చెందిన డా.కవిత పలు కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో యోగా ఆవశ్యకతను వివరించేందుకు నిత్యం ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు యోగా తరగతులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు నయమయ్యేందుకు యోగా ఎలా ఉపయోగపడుతుందో స్వయంగా ఆమె చేస్తూ Dr.kavitha Ajay’s life style యూట్యూబ్ ఛానల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రత్యక్ష ప్రసారాన్ని అనుసరిస్తూ యోగా చేస్తున్నారు.
ఇదీ చదవండి: 17 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు