ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్, జన్నారం అటవీ ప్రాంతాలను కలిపి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంగా సుమారు ఆరేళ్ల క్రితం ప్రకటించారు. అప్పటి నుంచి పులులకు ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, ఆశించిన స్థాయిలో వాటి రాకపోకలు సాగలేదు. మంచిర్యాల అటవీ ప్రాంతం పరిధిలోని కాగజ్‌నగర్ ప్రాంతంలో మాత్రం పులుల కదలికలు కనిపించాయి. నిర్మల్ పరిసరాల్లోకి వస్తుందా లేదా అని నిరుత్సాహపడుతున్న సమయంలో పులి (Tiger) రావడం అధికారులకు ఉత్సాహాన్నిస్తోంది.
మహారాష్ట్ర నుంచి వచ్చి...
నిర్మల్ అటవీ డివిజన్ పరిధిలోని భైంసా, నిర్మల్ అటవీరేంజ్‌లో పులి సంచారాన్ని అధికారులు నిర్ధరించారు. ఈనెల 26న సాయంత్రం అటవీ ప్రాంతంలో పులి కదలికలు చూశామన్న క్షేత్రస్థాయి సిబ్బంది సూచనతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సదురు ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. పులి పాదముద్రలను గమనించి వాటి ఆకారాల నమూనాలను సేకరించారు. నిపుణుల సాయంతో పరిశీలిస్తే సుమారు రెండేళ్ల వయసున్న ఆడపులిగా అవగాహనకొచ్చారు. సమీపంలోని మహారాష్ట్ర ప్రాంతం నుంచి పులి వచ్చినట్లు తెలుస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురవడం, అటవీప్రాంతంలో పచ్చదనం పరుచుకోవడం వల్ల దీని రాకకు మార్గం సుగమమైంది.
ప్రజల భయం...
అటవీ శివారు గ్రామాల్లోని ప్రజలు... పులి వచ్చిందని తెలియడం వల్ల భయాందోళనకు గురవుతున్నారు. తామంతా వ్యవసాయం, పశువుల పెంపకంపై ఆధారపడి జీవించేవారిమని పులి దాడులకు పాల్పడితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారాన్ని నిర్ధరణ చేసుకున్న నిర్మల్ జిల్లా అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని నియమించారు. పులి ఆవాసానికి అనువుగా ఉన్న ప్రాంతాలు, తిరిగేందుకు అవకాశమున్న ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ఇప్పటికే 25 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
పులికి అండగా... గట్టి నిఘా..
సాధారణంగా ఇవి ప్రశాంతంగా, రక్షణగా ఉన్న చోటనే ఉండటానికి ఇష్టపడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆవాసానికి అనువైన వాతావరణం కల్పించాలని భావిస్తున్నారు. పులి సంచారానికి ఆటంకం కల్గించకుండా, వేటగాళ్ల నుంచి ప్రమాదం ఏర్పడకుండా నిరంతర నిఘాను కొనసాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటవీ పరిసరాల్లోని గ్రామాలకు వెళ్లి అక్కడి స్థానికులు, ప్రజాప్రతినిధులకు సమాచారం అందిస్తున్నారు. ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, పులి సంచారంపై భయపడొద్దని సూచిస్తున్నారు. ఎక్కడైనా కనిపించినా, దాడిచేసినట్లు గుర్తించినా వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్తున్నారు. డీఎఫ్ఓ, ఎల్డీఓ, ఎస్ఆర్డీ, క్షేత్రస్థాయి సిబ్బంది ఫోన్ నెంబర్లను అందజేస్తున్నారు.
గుంపులుగా వెళ్లండి...
అటవీ ప్రాంతాల పరిధిలో ఉన్న గ్రామస్థులు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్లవద్దనే ఉండాలని పేర్కొన్నారు. పొలం పనులు, ఇతరత్రా అవసరాల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తే కనీసం అయిదుగురికి తగ్గకుండా గుంపుగా వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో ఒకరిద్దరు శబ్ధాలు చేస్తుండాలని చెప్పారు. దీనివల్ల పులి దగ్గరకు వచ్చేందుకు భయపడుతుందని తెలిపారు. పశువులను మేత కోసం అటవీ ప్రాంతాలకు పంపించకపోవడం మంచిదని సూచించారు.
ఇదీ చదవండి: Bandi Sanjay : భాజపా కార్యాలయ బేరర్లతో బండి సంజయ్ భేటీ...