SRSP-basara: బాసర నుంచి ఎస్సారెస్పీకి బోట్లు నడపాలనే యోచన చాలాకాలంగా ఉంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం శంకుస్థాపనకు పోచంపాడు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. పథకం పూర్తయితే కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీ నిండాక బాసర-ఎస్సారెస్పీ మధ్య పడవలో వెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి, పర్యాటక శాఖ అధికారులు నౌకావిహారంపై దృష్టి సారించారు. 2019లో కసరత్తు ఆరంభించి ప్రయోగాత్మకంగా నడిపారు. త్వరలో సర్వీసులు ప్రారంభిస్తామని పర్యాటకశాఖ పేర్కొని రెండేళ్లయినా ఆ దిశగా కార్యరూపం దాల్చలేదు.
భక్తులకు నిరాశే..
ఆహ్లాదం, మధురానుభూతిని కలిగించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ సాకారమైతే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎస్సారెస్పీ చేరుకుని అక్కడి నుంచి బాసరకు, బాసర నుంచి తిరిగి శ్రీరాంసాగర్‌కు పడవల ద్వారా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ఎస్సారెస్పీని ఆనుకుని ఉన్న నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్, నాగాపూర్ గ్రామాల దగ్గర బోటింగ్ పాయింట్‌ను ఏర్పాటుచేసి బాసర వరకు పడవలను నడపాలని గతంలో అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. కానీ, నేటికీ ఈ ప్రాజెక్ట్‌ను ఆలోచనలకే పరిమితం చేశారు.
అనుకూలతలు అనేకం..
పర్యాటకశాఖ చొరవచూపి గోదావరిలో బోటు ప్రయాణాలను ఆరంభిస్తే ఇరువైపులా రెండున్నర గంటల వ్యవధిలో గమ్యం చేరుకోవచ్చు. సుమారు 60 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం సాగుతుంది. మధ్యలో బ్రహ్మేశ్వరం, ఉమ్మెడ తదితర పర్యాటక ప్రాంతాల వద్ద బోట్లు నిలిపినా మూడుగంటల్లో బాసరకు చేరుకోవచ్చు. వేసవి మినహా మిగతా 8 నెలల పాటు పడవలను నడపవచ్చు.
ఇదీ చూడండి: 'భారత్‌లో థర్డ్ వేవ్- ఫిబ్రవరిలో గరిష్ఠానికి కేసులు!'