నిర్మల్ జిల్లా కుర్రన్నపేట చెరువులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని న్యాయవాది అంజుకుమార్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్. చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.
చెరువును సందర్శించి ఎఫ్టీఎల్ను నిర్ధరించి.. అక్రమ నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగించాలని గతంలో ఆగస్టు 20న హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శుక్రవారం నివేదిక సమర్పించారు. కలెక్టర్ నివేదిక మొక్కుబడిగా ఉందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొనడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
సెప్టెంబరు 8న చెరువు సందర్శించిన కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలు ఒక్క రోజు కూడా ఉండటానికి వీల్లేదని పేర్కొంది. కలెక్టర్ తీరు అపహాస్యం చేసేలా ఉందని అసహనం వ్యక్తం చేసింది. చెరువులో ఇప్పటికీ ఆలయాలను నిర్మిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దేవుడి పేరుతో కూడా చట్టాన్ని ఉల్లంఘించేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇదీ చదవండి: సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు: కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ