BASARA RGUKT: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ఆర్జీయూకేటీలో శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.
మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు భాజపా ఎంపీ సోయం బాపూరావు వస్తుండగా.. లోకేశ్వరం మండలంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా ఆర్జీయూకేటీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యార్థుల ఆందోళనకు కారణమిది..
ఇటీవల ఆర్జీయూకేటీలో ఆహారం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు భోజనశాల నిర్వాహకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు నూతన నిర్వాహకులను నియమించి నాణ్యతగా భోజనం అందించాలంటూ ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణకు ఇటీవల విన్నవించారు. దీంతో పాటు మరికొన్ని డిమాండ్లనూ వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలను 24వ తేదీలోపు పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి వీసీ వారికి భరోసా ఇచ్చారు. గడువు ముగిసి ఐదు రోజులు పూర్తయినా డిమాండ్లను నెరవేర్చక పోవడంతో విద్యార్థులు శనివారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు.
ఇవీ చూడండి..
'హర్ ఘర్ మే తిరంగా'.. చేనేత కార్మికులకు వరంగా..!
సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు.. 'చనిపోయినా సరే.. ఎవరికీ లొంగను'