రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అసమ్మతి నేతలందరినీ బుజ్జగించి... ఇతర పార్టీల్లోని నేతలను తెరాసలో చేర్చుకున్నారు. వీరిలో చాలా మంది నేతలు జడ్పీ ఛైర్మన్ పదవి కోరుకుంటున్నారు. నిర్మల్ జడ్పీ పీఠం జనరల్ మహిళకు రిజర్వు కాగా... తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోడలు దివ్యారెడ్డి పేరు తెరపైకి రావడం పట్ల గులాబీ దళంలో అలజడి ప్రారంభమైంది.
ఆశావహుల్లో ఆందోళన
నిర్మల్ జిల్లాలో మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలుండగా... పది స్థానాలు గెలిచిన పార్టీ జడ్పీ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న వల్లకొండ శోభారాణి సత్యానారాయణ గౌడ్, కేసీఆర్ అనుచరుడైన వడ్డి దేవేందర్‌రెడ్డి సతీమణి పాటు మరికొందరు జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. వీరందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ... మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోడలు దివ్యారెడ్డి పేరు తెరపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. దివ్యారెడ్డి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రోత్సాహం వంటి అంశాలతో ఆశావహులైన నేతల్లో ఆందోళన నెలకొంది.
కేటీఆర్ వద్దకు
జిల్లాలో వ్యూహాత్మకంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు... ఇంద్రకరణ్‌రెడ్డి ప్రధాన అనుచరులకు కూడా అంతుచిక్కడం లేదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. జిల్లాలోని ఒకరిద్దరు కీలకనేతలు ఏకంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చిన అధిష్ఠానం ఎవరిని ఎలా బుజ్జగిస్తుందనేది ఆసక్తిగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ సెగ్మెంట్లో తక్కువగా పోలింగ్ నమోదు అయిన విషయాన్ని నిఘా వర్గాలు అధిష్ఠానానికి చేరవేయడం చర్చనీయాంశమైంది.
ఇవీ చూడండి: ప్రపంచకప్‌లో పాల్గొనే సఫారీ జట్టిదే