ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అభినందనీయమని, అలాంటి గొప్ప మనస్సు కొందరికే ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన లక్కడి జగన్మోహన్ రెడ్డి, నవయుగ మూర్తి, శ్రీధర్, లక్కడి జైపాల్ రెడ్డి నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆహారం అందిస్తున్నారు. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి గత 67 రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెండు పూటల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు.
ఇలాంటి మంచి మనుసున్నవారిని ఎంత పొగిడినా తక్కువేనని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా దాతలను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర కీలకమైందని, విపత్కర పరిస్థితుల్లో 24 గంటలు అలుపెరగకుండా విధులు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. సరైన సమయంలో ఆహారంతో పాటు విశ్రాంతి తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ జాన్ దివాకర్, ఆర్ఐ కృష్ణాంజనేయులు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత