నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రత్నాకర్ రెడ్డి అనే రైతు ధాన్యం కొనుగోళ్లు సందర్భంగా అవకతవకలు జరిగాయని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంపై వివాదం చెలరేగింది.
తాను అమ్మిన ధాన్యానికి రూ. 34 వేల రూపాయలు తక్కువగా వచ్చిందని రైతు వాపోయాడు. తరుగు పేరుతో క్వింటాకు 8 కిలోలు, బస్తాకు రూ. 15 చొప్పున నగదు వసూలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. దీనికి బాధ్యులెవరని జిల్లా పాలనాధికారిని ప్రశ్నించాడు. ఆగ్రహించిన కలెక్టర్.. రైతు రత్నాకర్ రెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.
రత్నాకర్ రెడ్డిని అరెస్టు చేస్తే తామందర్నీ అరెస్టు చేయాలని మిగతా రైతులంతా పట్టుబట్టడం వల్ల కలెక్టర్ చల్లబడ్డారు. అన్యాయం జరిగిందని ప్రశ్నించడం తప్పా.. ఇలా ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేస్తారా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన అధికారులే ఇలా ఆగ్రహిస్తే తమ బాధలు ఇంకెవరికి చెప్పుకోవాలని వాపోయారు. మంగళవారం ఉదయం నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారని.. వర్షం వస్తే పంట మొత్తం పాడైపోతుందని ఆందోళన పడుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: Viral Video: బాలుడ్ని చావబాదిన మాజీ పోలీస్