నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రమాదాలు జరిగే రోడ్లు, ప్రాంతాలను గుర్తించి సత్వర నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. కల్వర్టులు ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని... వాటి నివారణకు సూచికలను ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారులు గుర్తించిన సమస్యలపై ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ, నేషనల్ హైవే శాఖలు సంయుక్తంగా గుర్తించి... ప్రమాద రహిత జిల్లాగా మార్చేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ సహకరిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ రెవెన్యూ అధికారి రాఠోడ్ రమేశ్, డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి అజయ్ కుమార్ రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ తరుణ్ కుమార్, ఆర్అండ్‌బీ ఈఈ అశోక్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శంకరయ్య, భైంసా ఆర్డీవో రాజు, నిర్మల్, భైంసా మున్సిపల్ కమిషనర్లు- బాలకృష్ణ, ఖాదిర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి'