అత్యాధునికి సదుపాయాలతో కూడిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో పది పడకలతో ఏర్పాటు చేశారు. పేదలు చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి డయాలసిస్ కేంద్రాన్ని నిర్మల్‌లోనే ఏర్పాటు చేశామన్నారు. రోజుకు 40 మంది కిడ్నీ రోగులకు రూపాయి ఖర్చు లేకుండా డయాలసిస్ చేయవచ్చని తెలిపారు.
ఒకరికి వాడిన పరికరాలను ఉపయోగించకుండా డిస్పోజబుల్ పరికరాలను వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఆస్పత్రిని రూ.20 కోట్లతో మరింత అభివృద్ధి చేసి, 100 పడకల ఆస్పత్రిగా మారుస్తామని మంత్రి అన్నారు. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసిన డాక్టర్ రఘునందన్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కరోనా సమయంలో సేవలందించిన పురపాలక పారిశుద్ధ్య కార్మికులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్ గ్రంథాలయ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్ పాల్గొన్నారు.