నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శివాజీ చౌక్ నుంచి కుభీరు చౌరస్తా వరకు మరమ్మతులకు గురైన రహదారిని, కూడళ్లను అభివృద్ధి చేసేందుకు రోడ్లు భవనాల శాఖ, ‘పుర’ సంఘాలు సమన్వయంతో నిర్ణయించాయి. రెండు నెలల కిందట చేపట్టాల్సిన పనులు లాక్‌డౌన్‌తో నిలిచిపోయాయి.
ముథోల్ నియోజకవర్గంలో ప్రధాన కేంద్రం భైంసా పట్టణం. పురపాలక సంఘంగా ఉన్న పట్టణం మూడు సంవత్సరాల కిందట రెవెన్యూ డివిజన్‌గా మారడంతో ప్రాధాన్యం పెరిగింది. పట్టణంలో శివాజీ చౌక్ జాతీయ రహదారి 61 కూడలి నుంచి కుభీరు చౌరస్తా వరకు బస్టాండు ప్రధాన రహదారి ఉంది. మూడు సంవత్సరాల నుంచి రహదారిపై తారు లేచి గుంతలు పడి అధ్వానంగా మారింది. ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ రహదారి రోడ్లు భవనాలశాఖ పరిధిలో ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా దానిని తమకు అప్పగించాలని పురపాలక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించగా ఆ విషయం ఇంకా పరిశీలనలో ఉంది. అడపాదడపా ఆర్‌అండ్‌బీ శాఖ తాత్కాలిక మరమ్మతులతో కాలం నెట్టుకు వస్తోంది.
భారీగా నిధులు..
ఎట్టకేలకు రెండు శాఖలు స్పందించి రహదారి అభివృద్ధి కోసం ప్రతిపాదించగా ఆర్‌అండ్‌బీశాఖ రహదారి అభివృద్ధికి రూ.కోటి మంజూరయ్యాయి. వీటితో రహదారి విభాగిణి నుంచి ఇరువైపులా 25 అడుగుల వెడల్పుతో తారు రోడ్డును అభివృద్ధి చేయాలి. అలాగే పురపాలకశాఖ టీయూఎఫ్‌ఐడీసీ పథకం కింద రూ.3.15 కోట్ల నిధులతో రహదారికి ఇరువైపులా చివర 15అడుగుల వెడల్పుతో పేవర్‌బ్లాక్స్‌తో ఫుట్‌పాత్‌ను, కూడళ్లను అభివృద్ధి చేపట్టాలి. అవసరమైన చోట్ల మురుగు కాల్వలు నిర్మించాలి. అయితే ఇప్పటికే పనులు ప్రారంభించాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో పనులు అటకెక్కాయి.
త్వరలోనే ప్రారంభిస్తాం
-రవీందర్‌రెడ్డి, డీఈఈ, అర్‌అండ్‌బీ, భైంసా
రహదారి అభివృద్ధి కోసం ఇరువైపులా ఆక్రమణలు తొలగించాం. రహదారిని చదును చేసి వెట్‌మిక్స్, తారు వేయాల్సి ఉంది. విశాఖపట్టణం నుంచి తారు తెప్పించాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా సమస్య ఏర్పడుతోంది. అది వచ్చిన వెంటనే పనులు చేపడతాం.