కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. నిర్మల్ జిల్లా కనకాపూర్ గ్రామం వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ చట్టాలు రైతులకు మేలుచేసేలా లేవని.. వారు దివాలా తీసే విధంగా ఉన్నాయంటూ ఆరోపించారు. దీనితో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
స్వేచ్ఛా మార్కెట్ పేరుతో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని రైతులకు నష్టం చేసే అవకాశం ఉందని మండిపడ్డారు. ఈచట్టాలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు ఎస్.ఎన్ రెడ్డి, సీపీఎం నాయకులు దుర్గ నూతన కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రామలక్ష్మణ్, గంగన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్వర్, పోశెట్టి, లక్ష్మణ్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కూలీ రేటు పెంచాలని హమాలీ కార్మికుల ధర్నా..