వరిధాన్యం కొనుగోలు వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల్ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోందని కాంగ్రెస్ నేతలు అన్నారు. అధికారుల కళ్లెదుటే నిలువుదోపిడి జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాలు, తరుగు పేరుతో ప్రతి బస్తాపై కోత విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ధాన్యం తూకం వేయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు, తెరాస నాయకులు కుమ్మక్కై రైతుల వద్ద నుంచి దోపిడీకి పాల్పడి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొందన్నారు. ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇవీ చూడండి: ఆ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు తావులేదు'