CM KCR Inaugurate New Collectorate in Nirmal : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కొండాపూర్ వద్ద నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులకు తాళాలను అందించిన తర్వాత సీఎం కేసీఆర్.. మరో ఆరు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి.. నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం, కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్ కార్యాలయం, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని, హెలిప్యాడ్‌ను పరిశీలించారు.
CM KCR Nirmal Tour Today : నిర్మల్ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎల్లపల్లి గ్రామ శివారులోని క్రషర్ రోడ్లో అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గత 9 ఏళ్లుగా ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు.
ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేసి.. ప్రతీ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనాలను నిర్మించారని పేర్కొన్నారు. సీఎం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
దశాబ్ది ఉత్సావాలను విజయవంతం చేయాలి: నిర్మల్‌లో నెలకొల్పిన స్టెరిలైజేషన్ సెంటర్ తరహాలో దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. అటవీ శాఖలో ఉన్న ఖాళీల భర్తీని టీఎస్పీఎస్సీతో సంప్రదింపుల ద్వారా త్వరగా రిక్రూట్మెంట్ జరిగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీలుగా ఉన్న అన్ని ప్రాంతాల్లో బాధ్యతాయుతమైన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. శాఖ పరంగా రాష్ట్రంలో జరుగుతున్న 21 రోజులు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, పదేళ్ల ప్రగతిని అన్ని వర్గాలకు వివరించాలని సూచించారు. అలాగే ఈ నెల 6న నాగర్ కర్నూలు, 9న మంచిర్యాల, 12న గద్వాలలో కొత్త కలెక్టరేట్ భవన సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఇవీ చదవండి: