అనారోగ్యం, వ్యక్తి గత కారణాలతో జీవితంపై విరక్తి చెంది అన్నదమ్ములు ఇద్దరు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని షెట్పల్లి సంగరెడ్డి గ్రామానికి చెందిన చిట్టిమెల్ల పరమేశ్వర్ (50) చిట్టిమెల్ల రాములు(40), అన్నదమ్ములు. రాములుకు మాటలు రావు, మతిస్థి మితం లేదు. పరమేశ్వర్ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో పాటు తమ్ముడు రాములు బాగోగులు చూసుకునేవాడు.
కొన్నిరోజుల క్రితం పరమేశ్వర్ అనారోగ్యానికి గురవడం వల్ల తమ్ముడిని చూసుకోవడం ఇబ్బందిగా మారింది. ఒకవేళ తను చనిపోతే.. తమ్ముడి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
పరమేశ్వర్ తన భార్యను రెండురోజుల క్రితం బంధువుల వివాహనికి పంపించారు. అనంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి గ్రామంలో ఓ వివాహానికి వెళ్లివస్తామని బయలుదేరారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులకు సమాచారం ఇచ్చారు. అందరు కలిసి వెతకడం ప్రారంభించారు. బంధువుల ఫిర్యాదు మేరకు లింగంపేట్ పోలీస్ స్టేషన్లో అదృశ్య కేసు నమోదు చేశారు.
శుక్రవారం బాసరలో గుర్తు తెలియని శవాలు లభ్యమయ్యాయి. మృతి చెందింది అన్నదమ్ములేనని కుటుంబ సభ్యులు గుర్తించారు . ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పరమేశ్వరకు భార్య ,కుమారుడు ఉన్నారు.