సాధారణంగా మద్యం దుకాణం ఏర్పాటుచేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల ఏర్పాటు చేయడానికి లక్కీడ్రా పద్ధతిన ఎవరినో ఒకరిని మాత్రమే ఎంపిక చేస్తారు. అలా అనుమతిపొందిన మద్యం దుకాణంలో కేవలం విక్రయాలు మాత్రమే జరగాలి. ఒకవేళ మద్యం కొన్నవారు అక్కడే తాగేలా ఏర్పాట్లు చేయాలనుకుంటే అనుమతి గది (పర్మిట్ రూం) ఏర్పాటుచేసుకోవచ్చు. ఇదంతా సక్రమంగా కొనసాగాలంటే రూ.లక్షల్లో పెట్టుబడులు అవసరం. మద్యం దుకాణం నిర్వహణకు ఇంత తతంగం అవసరమా? ఇవేమీలేకుండా నిర్వహించుకోలేమా అంటే నిర్వహించుకోవచ్చు. కాకపోతే అనధికారికంగా.. వాటిపేరే గొలుసు దుకాణం (బెల్ట్ షాప్).
పట్టణాలు, గ్రామాలు ఎక్కడచూసినా ఇలాంటి దుకాణాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎలాంటి అనుమతిలేదని చెబుతూనే అధికారులు సైతం వీరిపై చర్యలు తీసుకోవడానికి ఉపేక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మూడు పట్టణాలు, 18 గ్రామీణ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 80 వార్డులు, 396 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 350కి పైగా ఇలాంటి గొలుసు దుకాణాలు నడుస్తున్నాయంటే అశ్చర్యపోవాల్సిందే. అనుమతి పొందిన దుకాణాలకు దీటుగా ఈ గొలుసు వ్యాపారం కొనసాగుతోంది.
అను‘మతి’ లేకుండా విక్రయాలు
అక్రమ మద్యం నివారించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నా.. సంబంధితశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనుమతిలేని గొలుసుదుకాణాలను నియంత్రించాలంటూ అధికారులకు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇది సక్రమంగా అమలుకావటం లేదు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో స్థానికంగా ఉన్న కమిటీలు ప్రత్యేకంగా టెండర్ ప్రక్రియను నిర్వహించి మరీ గొలుసు దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇలా దుకాణం దక్కించుకున్నవారు దర్జాగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారులకు అవసరమైన మద్యం ప్రభుత్వంచే అనుమతిపొందిన మద్యం దుకాణాల నుంచే వస్తుంటుంది. వాస్తవానికి ఇలా సరఫరా చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం. వీరికి ప్రత్యేకంగా నిబంధనలంటూ ఏమీ ఉండవు. పైగా తమ అమ్మకాలను పెంచుకునేందుకు సదరు మద్యం వ్యాపారులు దొంగచాటుగా గొలుసు దుకాణాలకు మద్యం తరలిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే దుకాణాలు తెరుస్తున్నవారు లేకపోలేదు. రాత్రి 10 గంటలవరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఒకవేళ అర్ధరాత్రి అవసరమొచ్చి దుకాణదారుని నిద్రలేపినా మనకు కావాల్సిన మద్యం దొరుకుతుంది. ఇంత సౌలభ్యం ఉండటంతో అమ్మకాలు విపరీతంగానే ఉంటున్నాయి.
రూ. లక్షల్లో వ్యాపారం...
జిల్లా కేంద్రానికి కొద్దిదూరంలో ఉన్న ఓ గ్రామంలో గొలుసు దుకాణం ఏర్పాటుచేసేందుకు సుమారు రూ.2 లక్షలకు పైగా చెల్లించారంటే అక్కడ అమ్మకాలు ఎంతమొత్తంలో సాగుతాయో ఊహించుకోవచ్చు. సమీపంలోని మరొక గ్రామంలో రూ.80 వేలకు దుకాణం దక్కించుకున్నారు. ఎందుకంటే అక్కడ మద్యం అమ్మకాలు తక్కువగా జరుగుతాయి. పైగా అది చిన్నగ్రామం కావటంతోనే. దీన్నిబట్టి అమ్మకాలు, జనాభా ఆధారంగా గొలుసు దుకాణాలకు టెండర్లు నిర్వహిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. దాదాపు ప్రతీ గ్రామంలోనూ ఇలాంటి గొలుసు దుకాణాలు ఒకటి, రెండు దర్శనమిస్తుంటాయి. అనుమతి పొందిన మద్యం దుకాణాల నుంచి నేరుగా మద్యం కొనుగోలుచేసి తీసుకొస్తారు. ఆపై వీటిని రూ.5 నుంచి రూ.15 వరకు అదనపు ధరకు విక్రయిస్తుంటారు. ఇక్కడ ఉన్న మరో సౌలభ్యమేంటంటే.. సిట్టింగ్ రూం. మద్యం కొనుగోలుచేసినవారు హాయిగా అక్కడే కూర్చొని తాగొచ్ఛు అందుకే ఇక్కడ మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఒక్కో చీప్‌లిక్కర్‌పై ఎంతలేదన్నా రూ.5 వరకు అదనంగా వసూలుచేస్తారు. సగటున ఒక్కో గొలుసు దుకాణంలో ప్రతిరోజూ రూ.15వేల నుంచి రూ.40 వేల వరకు మద్యం అమ్మకాలు కొనసాగుతాయి. ఇందులో నిర్దేశిత రుసుముకన్నా వీరు అదనంగా వసూలుచేసే సొమ్మే రూ.750 నుంచి రూ.2వేల వరకు ఉంటుంది. ఈలెక్కన ప్రతినెలా రూ.22వేల నుంచి రూ.60వేల వరకు ఆదాయం సమకూరుతోంది. పెద్దగ్రామాల్లో, జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో ఆదాయం మరింత పెరుగుతుంది. ఈ ఆదాయానికి ఎలాంటి లెక్కలుండవు. పన్నులుండవు. అడిగేవారు ఎవరూ ఉండరు. పట్టించుకునేవారు అస్సలు కనిపించరు. అందుకే ఏటా ఈ గొలుసువ్యాపారం నిరభ్యంతరంగా కొనసాగుతోంది.
ఎక్కడ ఏర్పాటుచేస్తున్నారంటే..
గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా స్థలం అంటూ ఏదీలేదు. వ్యాపారి అవకాశాన్ని బట్టి వీటిని నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల కిరాణదుకాణాలు, హోటళ్లు, కూల్‌డ్రింక్ దుకాణాల్లో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. కేవలం గ్రామాల్లోనే కాదు పట్టణంలోనూ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. చిన్నచిన్నహోటళ్లలో ఇలా అక్రమ మద్యం అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. బడి, గుడి అనే తేడా ఏమాత్రం ఉండదు. రోడ్డుపక్కన, ఇళ్లమధ్యన సైతం ఇలాంటి దుకాణాలు కనిపిస్తుంటాయి. కొన్నిసందర్భాల్లో మద్యం మత్తులో గొడవలు పడటం కూడా సహజంగా మారింది. అడ్డగోలుగా ఈ దుకాణాలు నిర్వహిస్తుండటంతో మహిళలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆమార్గంలో వెళ్లేందుకు సైతం జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. గొలుసు దుకాణాలను నియంత్రించాల్సిన అబ్కారీ అధికారులు తమకేమీ పట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ దుకాణాల్లో దర్జాగా మద్యం అమ్మకాలు, సిట్టింగ్ జరుగుతున్నా అధికారులెవరూ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామంలోని ప్రధాన రహదారిపైనే ఎలాంటి బెరుకు లేకుండా బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నారు. టేలా వెనుకాల గుడిసెలో అనుమతి ఉన్న గదుల మాదిరిగా మందుబాబులు సిట్టింగ్ ఉంది. రహదారిపైనే గొలుసు దుకాణం నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ గ్రామంలో రెండు మద్యం దుకాణాలకు అనధికారికంగా వేలం వేశారు. ఇక్కడ రెండు దుకాణాలకు కలిపి రూ.6 లక్షల వరకు పలికినట్టు సమాచారం. అందుకే ఇక్కడ విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు.
ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'