నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన రమణారెడ్డి డెయిరీ కేంద్రంలో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన వద్ద ఒక జెర్సీ ఆవు దూడ చనిపోవడంతో పాలకోసం దూడ కళేబరాన్ని ఆ పక్కన వేలాడదీశాడు. ఇదేమిటీ అనుకుంటున్నారా.! అవును అక్కడ ఉన్నది దూడ బొమ్మ కాదు. నిజమైన దూడ శరీరమే. ఏంటీ వినగానే ఆశ్చర్యం కలుగుతోందా.! కాకపోతే అది చనిపోయింది. ఇటీవల హరియాణా ప్రాంతం నుంచి గర్భంతో ఉన్న ఈ ఆవును తీసుకొస్తున్న సమయంలోనే ఈనింది. పుట్టిన వెంటనే లేగదూడ చనిపోయింది. ఈ విషయం దానికి తెలియదు. లేగ దూడ లేకపోతే అది పాలివ్వదు. అలాగని మృత కళేబరాన్ని అలాగే వదిలేస్తే కుళ్లిపోతుంది. దీంతో వైద్యుల సూచన మేరకు దూడ శరీరం లోపలి అవయవాలు జాగ్రత్తగా తొలగించి అచ్చం దూడలాగే రూపొందించాడు ఆ యజమాని.
వైద్యుల సూచనలతో కళేబరాన్ని శుభ్రం చేసి.. చెడిపోకుండా గడ్డి, ఉప్పుతో నింపి, కర్రల సాయంతో దూడ శరీరంలాగే సిద్ధం చేశారు. ప్రతిరోజూ పాలు పితికే సమయంలో ఆవు ముందు ఈ దూడ కళేబరం ఉంచడంతో అది ప్రేమగా దాన్ని నాకుతూ మాతృప్రేమను చూపిస్తోంది. అవన్నీ తన బిడ్డకోసమేనని ఆనందంగా పాలిస్తోంది. చదివేవారినే కాదు, చూసేవారి కళ్లు సైతం చెమర్చేలా ఉన్న ఈ దృశ్యం మాతృత్వపు మమకారానికి నిలువెత్తు నిదర్శనం.