నిర్మల్ బస్ డిపో పరిధిలో ఐదుగురు కార్మికులు మంగళవారం రోజున ఉద్యోగాల్లో చేరారు. అందుకు సంబంధించిన సమ్మతి పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య డిపో మేనేజర్‌కు అందజేశారు. చేరిన వారిలో నలుగురు కార్యాలయ సిబ్బంది కాగా... మరొకరు డ్రైవరు ఉన్నారు. విధుల్లో చేరిన ఉద్యోగులంతా తాము సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొంటూ స్వ దస్తూరితో రాసిన లేఖలను డిపో కార్యాలయంలో అందజేశారు. తమ పేరు, ఉద్యోగి సంఖ్య, హోదా, గుర్తింపుకార్డు వివరాలను జతచేశారు.
వీరంతా ప్రభుత్వ పిలుపు మేరకు బేషరతుగా ఉద్యోగంలో చేరుతున్నట్లు లేఖలో ప్రకటించారు. విధుల్లో చేరే ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఉద్యోగులను అడ్డుకున్నా... భౌతిక దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఆదిలాబాద్ డిపో పరిధిలోని అసిస్టెంట్ మేనేజర్ అమృత కూడా విధుల్లో చేరారు.
ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు