Mudugula Mallayya Thanda people's Problems : ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరిన ఓ వ్యక్తి లండన్‌లో టిఫిన్.. మధ్యాహ్నం అమెరికాలో లంచ్.. సాయంత్రం ముంబయిలో డిన్నర్ చేయగలుగుతున్న నేటి రోజుల్లోనూ.. పక్కూరికి వెళ్లాలంటే సప్త సముద్రాలు దాటినంతగా కష్టపడే గ్రామాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఓ మారుమూల గూడెం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మడిగెలమూల పంచాయతీ పరిధిలోని ముడుగుల మల్లయ్య తండా.
మారుమూల ప్రాంతంలో ఉండే ఈ తండాకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేక తండావాసులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కొన్నాళ్ల క్రితం గ్రామానికి చెందిన నిండు గర్భిణీకి పురిటి నొప్పులు రాగా.. అంబులెన్స్ రాని పరిస్థితి. ధన్వాడకు తరలించే ప్రయత్నంలో మార్గమధ్యలోనే తల్లితో పాటు కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ఏడాది కిందట తండాకు చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తికి గుండెనొప్పి వచ్చింది. ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకొని వెళ్తుండగా దారిలోనే ప్రాణం వదిలాడు. ఇవే కాదు.. అనేక విషాదకరమైన ఘటనలు నిత్యకృత్యం(Many Tragic Events are Routine)గా మారాయి.
No Proper Road to Thanda : ముడుగుల మల్లయ్య తండాకు సరైన రోడ్డులేక అష్టకష్టాలు పడుతున్నారు. ఏ అవసరాలున్నా కాలినడకన లేదా.. ద్విచక్రవాహనాలపై వెళ్లాల్సిందే. ఆటోలు, బస్సులు ఇక్కడికి రావు. రోడ్డు లేకపోవటంతో వాహనాలు పాడవుతాయని ప్రైవేటు వాహనాలనూ ఎవరూ నడపరు. ఇక వానాకాలంలో ఇక్కడ ప్రయాణమంటే నరకప్రాయమే. ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Government Primary School) ఉండగా.. ఉపాధ్యాయులు నానా తంటాలు పడి బడిని నడుపుతున్నారు. ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి పక్క గ్రామాలకు వెళ్లాల్సి ఉండటంతో.. ఐదో తరగతి పూర్తైతే చదువులు మానేస్తున్నట్లు వాపోతున్నారు.
'హక్కులు' లేని భారతీయులు! ఇండియా మ్యాప్‌లో కనిపించని గ్రామాల గురించి తెలుసా?
ఈ తండా నుంచి మండల కేంద్రమైన ధన్వాడకు వెళ్లాలంటే రెండు దారులున్నాయి. కిష్టాపూర్‌కు వెళ్లి అక్కన్నుంచి ధన్వాడకు ఒక మార్గం ఉండగా.. ముడుగుల మల్లయ్య తండా నుంచి కిష్టాపూర్‌కు ఏడు కిలోమీటర్ల మట్టి మార్గముంది. 2018లో ప్రభుత్వం కిష్టాపూర్ నుంచి ముడిగెల మూలతండా వరకు రూ.నాలుగున్నర కోట్ల నిధులతో బీటీ రోడ్డును మంజూరు చేసింది. కష్టాలు తీరుతున్నాయని సంబురాలు చేసుకున్నా.. గుత్తేదారు పనులను చేయకపోవడంతో విరబూసిన ఆశలు మొగ్గలోనే తుంచుకుపోయాయి.
సొంత నిధులతో రహదారి.. తమ సమస్యలను ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎవరికి మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేకపోవటంతో.. తండా వాసులంతా ఏకమయ్యారు. ఇంటికో రూ.పది వేలు సేకరించి.. రూ.5 లక్షలు జమ చేశారు. ఈ డబ్బుతో ముడుముల మల్లయ్య తండా నుంచి నారాయణపేట మండలం లింగంపల్లి పాత తండా వరకు 3 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మించారు.
పని ముగింపులో నిధుల కొరత వెంటాడుతుండగా.. మొరం వేయడానికి నిధులు సరిపోక మళ్లీ ఇంటింటికీ రూ.4 వేలు అదనంగా వేసుకుని.. పనులు పూర్తి చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని తండావాసులు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా రూ.7 లక్షల సొంత నిధులతో రోడ్డు వేసుకోవడం(Construction of Road With Own Funds) వీరు పడిన కష్టాలకు, వారి ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తోంది. తాత్కాలికంగా ప్రస్తుతం సమస్య తీరినా.. ప్రభుత్వం తమ తండాకు బీటీ రోడ్డు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని తండావాసులు వేడుకుంటున్నారు.
బోయిన్పల్లి తండా గుట్టల్లో చిరుతల సంచారం
Problems in Narayanpet Junior College : ఆ కళాశాలలో సమస్యల తిష్ఠ.. ఇలాగైతే చదివేదెట్టా...?