నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలిక తల్లిదండ్రులు వారి ఇద్దరి కుమారుల బాధ్యతను ఆమెకు అప్పగించి హైదరాబాద్కు వలస వెళ్లారు. నాలుగు, ఆరు తరగతులు చదువుతున్న తమ్ముళ్లను ఎవరి సాయం లేకుండా పదో తరగతి చదువుతోన్న ఆ బాలిక కంటికి రెప్పలా చూసుకునేది. ఇంటి పక్కనే ఉండే ఇంటర్ విద్యార్థి ప్రేమ పేరుతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు తమ వద్ద లేకున్నా ధైర్యం కోల్పోని ఆ బాలిక సదరు యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గ్రామానికి వచ్చిన పోలీసులు.. మరోమారు ఆ యువకుడు బాలికను వేధించకుండా చూసుకుంటామని గ్రామపెద్దలు ఇచ్చిన హామీ తిరిగి వెళ్లారు. బుధవారం ఉదయం ఇంటి ముందు పరిసరాలు శుభ్రం చేస్తున్న బాలిక వద్దకు వచ్చిన ఆ యువకుడు.. తనను పెళ్లి చేసుకోకపోతే.. సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తానని బెదిరించాడు.
యువకుని మాటలకు హడలిపోయిన బాలిక ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన బాలిక తమ్ముళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆత్మహత్యకు వేధింపులే కారణమని తెలిపారు.