నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. గుడిగండ్ల గ్రామంలో రహదారికి ఇరువైపుల ఉన్న చాలా ఇళ్లను కూల్చేశారు. దీనివల్ల ఎంతో మంది ఆశ్రయం కోల్పోయి.. భార్యాపిల్లలతో వీధిన పడ్డారు. నిబంధనల ప్రకారమే రోడ్డు విస్తరణ చేపడుతున్నా.. పేదలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
ఉన్న గూడును కూలగొట్టడం వల్ల ఎక్కడ తల దాచుకోవాలో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయని బాధితులు వాపోతున్నారు. అద్దె ఇంట్లో ఉండే స్థోమత తమకు లేదని.. ఒకవేళ అప్పు చేసి ఉందామనుకున్నా.. ఈ కరోనా కాలంలో ఎవరూ ఇల్లు అద్దెకు ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందారు.
మరికల్-మక్తల్ 167వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా దాదాపు 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరికల్-మక్తల్ వరకు జక్లేర్, గుడిగండ్లు, కాచువార్ గ్రామాల మీదుగా సాగుతున్న ఈ రహదారి పనుల్లో చాలా మంది ఆశ్రయం కోల్పోయారు. రోడ్డు పక్కనే ఉన్న షెడ్లను, వ్యాపార సముదాయాలనూ తొలగించడం వల్ల పలువురు ఇంటితోపాటు ఉపాధి కూడా పోయిందని లబోదిబోమంటున్నారు. గూడు కోల్పోయిన తమకు తక్షణమే పరిహారం అందించాలని.. రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని కోరారు.
- ఇదీ చదవండి : 8 రోజుల్లోనే కొవిడ్ ఆస్పత్రి నిర్మాణం