నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహించే ఏజెన్సీ నిర్వాహకులు తమకు బిల్లులు సకాలంలో రావట్లేదని వాపోతున్నారు. కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు బిల్లులు చెల్లిస్తేనే పథకం నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రతి రోజు పిల్లలకు మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నామని తెలిపారు.
పదేళ్లుగా ఆరు బయటే...
అరకొర వసతులతో ఎండాకాలంలో వంటలు చేయాలంటే తమ ఆరోగ్యం దెబ్బతింటుందని మదన పడుతున్నారు. వంట చేసేందుకు తాగునీటికి సైతం ఇబ్బందులున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో గత పదేళ్లుగా ఆరుబయటే వంటలు కొనసాగిస్తున్నామన్నారు. మూడు నెలల్లోనే సొంత భవనం నిర్వహిస్తామని చెప్పినేటికీ... ఆ భవనం అసంపూర్తిగానే దర్శనమిస్తోందన్నారు. ఫలితంగా చెట్ల కిందనే కూరలు తరుగుతున్నామని... వంట చేసేందుకు అష్ట కష్టాలు పడుతున్నామని వాపోయారు.
మౌలిక వసతుల కల్పన ఇంకెన్నడు ??
మరోవైపు కరెంట్ సక్రమంగా రాక నీటి సమస్య ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. నారాయణపేట అభ్యాసన ఉన్నత పాఠశాలలో వంట సమయంలో వచ్చే పొగ నేరుగా తమ కళ్లలోకే పోతోందన్నారు. బాత్రూం సైతం వంట గదికే ఆనుకుని ఉన్నందున... తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌ను నిర్వాహకులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : స్తంభించిన ట్రాఫిక్... ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు