Bandi Sanjay Praja Sangrama Yatra: రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 17వ రోజుకు చేరింది. ఈ యాత్ర నారాయణపేట జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ రాజాపూర్ చేరుకున్న బండి సంజయ్... అక్కడున్న చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో చేనేత కార్మికులు దయనీయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు గడిచినా... ఇప్పటివరకు చేనేత కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా కార్మికులకు అందజేయకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి చీరలు తీసుకొచ్చి తెలంగాణ చేనేత కార్మికులకు పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు పడుతున్న ఇబ్బందులను చేనేత కార్మికులతో ఏర్పాటుచేసిన ఇష్టాగోష్ఠిలో అడిగి తెలుసుకున్నారు.
కొన్నాళ్లు ఓపిక పడితే తెరాస ప్రభుత్వం పోయి... మీ అందరి ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే కార్మికుల కష్టాలు తీరతాయని భరోసా కల్పించారు. బండి సంజయ్ వెంట భాజపా సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ, రతన్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం చేనేత కార్మికులు బండి సంజయ్‌ని సత్కరించారు.
పాదయాత్రలో భాగంగా నారాయణపేట జిల్లాలో మొన్న ఓ ఇంటికి వెళ్లిన. పదిమంది ఇంట్లోకి పోతే కూలిపోయేటట్టున్నది. చేనేత కార్మికులను ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. రోజంతా రెక్కలు విరిగేలా వాళ్లు కష్టపడితే వాళ్లకు వచ్చే జీతం రోజుకు రూ. 120, రూ, 150 మాత్రమే. ఈ పరిస్థితి మారాలే. కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అయితడు, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, సంతోశ్‌రావు ఎంపీ అయితడు. వీళ్లేమో జీతాలు రూ. 5లక్షలకు పైగానే తీసుకుంటున్నరు. మీ జీతాలేమో ఇట్లున్నయి.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి :