ఇటీవల కురిసిన జోరు వానలకు కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసు నగర్ కాలనీకి చెందిన ప్రజలను అధికారులు ఇళ్లు ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాలర్లు, భక్తులను కృష్ణా నదిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద పెరగడం వల్ల 5.81 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యగా నదీ పరివాహక ప్రాంతంలోని వాసు నగర్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతంలోని పంట పొలాల్లోకి వరద నీరు చేరి.. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బాధిత రైతులు వేడుకుంటున్నారు.