ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా అనుములలో ఈనెల 14న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను రద్దు చేయాలని యుగ తులసి ఫౌండేషన్ ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇప్పటికే దీనిపై ఇద్దరు స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా యుగతులసి ఫౌండేషన్ ప్రతినిధులు బుద్ధ భవన్‌లోని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో సీఎం బహిరంగ సభకు అనుమతి ఇవ్వొద్దని సీఈవోను కోరినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. సభ నిర్వహించినట్లైతే హాజరైన వారి తరఫున కేసీఆర్‌తో చలాన్ కట్టించాలని డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిల ఖమ్మం సభకు అనుమతి ఇచ్చారని... గో మహాగర్జనకు ఇచ్చిన అనుమతినే రద్దు చేశారని వారు పేర్కొన్నారు.