నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ నియంత్రికల మరమ్మత్తుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఒకచోట అనుమతి పొంది, మరొకచోట మరమ్మత్తు కేంద్రాలను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. అధికారుల అండతో సూర్యాపేట జిల్లాలో అనుమతి పొందిన కేంద్రాన్ని మిర్యాలగూడలో నిర్వహిస్తూ రైతుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా టెండర్లను పిలిచి మండలానికి ఒకటి చొప్పున విద్యుత్ నియంత్రికల మరమ్మతుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం:
విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం రైతుల పాలిట శాపంగా మారింది. గ్రామీణ జిల్లాలో అనుమతి పొంది అక్రమంగా మరోచోట విద్యుత్ నియంత్రికలను మరమ్మతులు చేస్తున్నారు. అధికారుల సహకారంతో రైతుల నుంచి అదనంగా వసూలు సాగిస్తున్న తీరు ఈటీవీ భారత్ నిఘాలో వెలుగుచూసింది.
నిబంధనలకు విరుద్ధంగా:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెం శివారులో విద్యుత్ నియంత్రికల మరమ్మతుల కేంద్రం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా దిర్శించర్లలో అనుమతి పొంది, నిబంధనలకు విరుద్ధంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల నుంచి నియంత్రికలను స్థానిక అధికారులు ఇక్కడకు పంపి మరమ్మత్తులు చేస్తున్నారు. దర్శించెర్లలో మరమ్మతులు చేసినట్లు రవాణా ఎగుమతి, దిగుమతి బిల్లు పొందుతున్నారు.
అదనపు వసూళ్లు:
మిర్యాలగూడలో పారిశ్రామిక వాడ రైల్వే గేట్ సమీపంలో రెండు విద్యుత్ నియంత్రికల మరమ్మతు కేంద్రాలున్నాయి. రైతుల నియంత్రణలను ఇక్కడికి పంపాల్సి ఉండగా, స్థానిక అధికారులు నేరుగా ఈదులగూడెంలోని కేంద్రానికి పంపుతున్నారు. స్థానిక అధికారుల సహకారం వల్ల నిర్వాహకులకు ఇష్టారాజ్యంగా మారింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని సిబ్బంది రైతుల నుంచి అదనపు డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కొత్త టెండర్లు పిలిచి మండలానికి ఒకటి చొప్పున విద్యుత్ నియంత్రికల మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.