ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ శాసనసభ స్థానాన్ని దక్కించుకునేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నామినేషన్‌కు ఇంకా ఒక్కరోజే గడువు ఉండటంతో తెరాస అభ్యర్థి ఎవరు అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ.. నోముల భగత్ పేరును ప్రకటిస్తూ గులాబీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అంతర్గతంగా చేసిన సర్వేలు సహా.. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. నోముల భగత్ పేరును ఖరారు చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో భగత్‌కు.. బి-ఫారం అందించారు. రేపు ఉదయం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్కును భగత్‌కు అందించిన కేసీఆర్... త్వరలోనే తానూ ప్రచారం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
కోటిరెడ్డికి హామీ..
అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రగతిభవన్‌లో ఆశావహులు చిన్నపరెడ్డి, కోటిరెడ్డి కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించిన కేసీఆర్.. అందరికీ అవకాశాలు వస్తాయని వివరించారు. కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని.. కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ముందంజలో కాంగ్రెస్..
సాగర్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అందరికన్నా ముందు నిలిచింది. సీనియర్ నేత జానారెడ్డి పేరును కాంగ్రెస్ అధినాయకత్వం ఖరారు చేసింది. జానారెడ్డితోపాటు సీనియర్ నేతలంతా నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టారు. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన హస్తం పార్టీ.. తిరిగి ఆ స్థానంలో పాగా వేయాలని తహతహలాడుతోంది. సాగర్‌లో విజయం కోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... వామపక్ష పార్టీల కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రానికి విడివిడిగా లేఖలు రాశారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతివ్వాలని కోరారు.
భాజపా ఆచితూచి..
మరోవైపు సాగర్ అభ్యర్థి ఎంపికలో భాజపా.. ఆచితూచి వ్యవహరించింది. తమ అభ్యర్థిగా డాక్టర్ పనుగోతు రవికుమార్‌ను బరిలో నిలిపింది. తెరాస, కాంగ్రెస్ పార్టీలను ఢీకొట్టేందుకు సమాయత్తమవుతోంది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండటంతో అన్ని పార్టీలు క్షేత్రస్థాయి ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
ఇదీ చూడండి: కేసీఆర్ అండ, నాన్న కృషే నన్ను గెలిపిస్తాయి: నోముల భగత్