నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల సమీపంలోని మూసీనదిలో గత నెల 31న మత్స్యకారుడు శంకరయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. భూతవైద్యం పేరుతో మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే హత్యకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు. హత్యకు సంబంధించిన వివరాలను నల్గొండ డీఎస్పీ వెంకట్రెడ్డి నిన్న శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే...
గురజాలకు చెందిన ఎడ్ల సాలమ్మ కుమారుడు గతంలో అనారోగ్యానికి గురికావడం వల్ల అదే గ్రామానికి చెందిన వెంపటి యాదయ్యతో భూతవైద్యం చేయించింది. ఈ పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దిరోజుల క్రితం సాలమ్మ అనారోగ్యానికి గురికావడం వల్ల యాదయ్యను సంప్రదించగా... తన భూతవైద్యం మీద తనకు నమ్మకం లేక యాదయ్య... అదే గ్రామంలో మరో భూతవైద్యుడు వెంపటి శంకరయ్యను పరిచయం చేశాడు.
జనవరి 31న సాలమ్మకు భూతవైద్యం చేసేందుకు శంకరయ్యతో పాటు మరో ఆరుగులు కలిసి మూసీనదిలోనికి తీసుకువెళ్లారు. శంకరయ్య సాలమ్మతో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఆమె కత్తితో శంకరయ్య గొంతు కోసి హత్య చేసింది. మిగతావారు కదలకుండా పట్టుకుని సహకరించారు. అనంతరం మృతదేహాన్ని మూసీ నది ఇసుకలో పాతిపెట్టి అందరు పరారయ్యారు.
ఈ కేసులో నిందితులైన ఎడ్ల సాలమ్మ ఆమె భర్త చిన్న వెంకన్న, అదే గ్రామానికి చెందిన రమేశ్, యాదయ్య, మారయ్య, వెంపటి యాదయ్యలను చెరువుగట్టు ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు ద్విచక్రవాహనాలు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: జమ్మూలో అగ్నిప్రమాదం-కుప్పకూలిన భవనం