RS Praveen kumar fired on KCR: ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర 25వ రోజు నల్గొండ నియోజకవర్గంలోని పానగల్, పెద్ద సూరారం, తిప్పర్తి మండలంలోని పజ్జుర్, సర్వారం గ్రామాల్లో సాగింది. ఆర్ఎస్కు పలు గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
దళిత బంధు పేరుతో దగా: దళిత బంధు పేరుతో దళితులను దగా చేయడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెరాస నేతల బంధువులకు, అనుచరులకు మాత్రమే దళిత బంధు దక్కుతుందని, అర్హులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో దళితుల ఓట్లను కొల్లగొట్టడానికే కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు.
వందలాది మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. గత ఏడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీరక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. వారిని పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు ఉచిత ఎరువులు, సబ్సిడీతోపాటు పంటలకు గిట్టుబాటు ధర, పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు.
నియంత పాలన పోవాలి: కేసీఆర్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో చర్చించడానికే యాత్ర చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే కేసీఆర్ నియంత పాలన పోవాలని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: Srinivas Goud Visit Neera Cafe: 'అలాంటి వారు ఏ పార్టీలో ఉన్నా సహించం'