Need Help For Kidneys Failed Boy: చిన్న వయసులోనే పెద్ద కష్టాలు ఆ బాలుడిని చుట్టుముట్టాయి. తండ్రి వదిలి వెళ్లిపోగా... తల్లి పేదరికంతో పోరాడుతోంది. హాయిగా తోటిపిల్లలతో ఆడుతూ చదువుకోవాల్సిన ఆ బాలుడు... రెండు కిడ్నీలు పాడై మంచాన పడ్డాడు. పండ్లబండి తోస్తూ.. బతుకుభారం మోస్తున్న తాత దగ్గరికి చేరాడు. ఎలాగైనా మనవణ్ని దక్కించుకోవాలనే ఆశతో... ఆ వృద్ధుడు చేతికందిన కష్టం చేస్తున్నాడు. వైద్యం భారమై... దిక్కుతోచని స్థితిలో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
తోటి విద్యార్థులు బడికి పోతుంటే.. బతకడానికి పోరాడుతున్న ఈ బాలుడి పేరు నాయబ్ రసూల్. నల్గొండ జిల్లా హాలియా మైనారిటీ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి చిన్నప్పుడే వదిలి వెళ్లిపోగా... తల్లి రోజువారీ కూలిపని చేసుకుంటుంది. రసూల్ అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. లాక్‌డౌన్ తర్వాత రసూల్‌కు జ్వరం, వాంతులు రావడంతో తాత మస్తాన్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు బాలుడికి రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు.
'ఈ కిడ్నీ సమస్య వచ్చినప్పటినుంచి.. మా తాతే నన్ను చూసుకుంటున్నాడు. మా నాన్న అమ్మను, నన్ను వదిలి వెళ్లిపోయాడు. మా తాత బండి మీద వ్యాపారం చేసుకుంటాడు. నా వైద్యానికయ్యే ఖర్చును ఎవరైనా సాయం చేయండి.'
-రసూల్, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు
వైద్యం ఖర్చు భారమవుతోంది..
వైద్యుని మాటలు విన్న మస్తాన్ దంపతులకు ఏం చేయాలో అర్థం కాలేదు. తోపుడు బండిపై పండ్లు అమ్ముకునే మస్తాన్‌కు... డాక్టర్ చెప్పిన మాటల్లో చికిత్సకు పెద్దమొత్తంలో డబ్బు కావాలనే మాటే ఎక్కువగా వినిపించింది. చేతికందిన కష్టం చేసి మనవడికి చికిత్స చేయించినా.... వారానికి మూడుసార్లు డయాలిసిస్ చేయించాల్సిన అవసరం ఉండడంతో వైద్యం భారంగా మారింది.
రసూల్ కిడ్నీ మారిస్తే బతికే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు మస్తాన్ చెబుతున్నారు. బాలుడికి కిడ్నీ ఇచ్చేందుకు తల్లి సిద్ధంగా ఉన్నా... మార్పిడి చికిత్సకు దాదాపు రూ.8 లక్షలు అవసరమవుతోందని అంటున్నారు. పండ్లు అమ్ముకునే తమవద్ద అంత డబ్బు లేదని... దాతలు సాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Director Sekhar Kammula : గుడిసె దగ్ధమై డబ్బు కోల్పోయిన రైతుకు శేఖర్ కమ్ముల సాయం