నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి శివారులోని ఆంజనేయస్వామి దేవాలయంలో రికార్డులు డ్యాన్సులు(Recording dances) నిర్వహించారు. రెండేళ్లకు ఒకసారి జరిపే స్వామివారి జాతర అశ్లీల నృత్యాలకు వేదికైంది. శనివారం దైవ సన్నిధిలో కోలాటాలతో పాటు డీజేలు, ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి డ్యాన్సర్లను రప్పించి.. రెండు స్టేజిలను ఏర్పాటు చేసి రికార్డింగ్ డ్యాన్సులను స్థానికులు నిర్వహించారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసుల సమక్షంలోనే ఈ తతంగం రాత్రంతా కొనసాగిందని స్థానికులు చెబుతున్నారు. దేవుని ఉత్సవాలకు హరికథ, బుర్రకథ వంటివి ఏర్పాటు చేయాల్సిందిపోయి.. అశ్లీల నృత్యాలు చేయడం చర్చనీయాంశమైంది. 1500 నుంచి 2 వేల మంది హాజరైన ఈ వేడుకల్లో ఎవరూ మాస్కులు ధరించకపోవడం గమనార్హం.
ఈ జాతరకు ఇద్దరు ఎస్సైలు, 15 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. శనివారం ఆంజనేయస్వామి తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: TS Police: కాళ్లకు చెప్పులు లేకుండా పరుగెత్తి.. అంబులెన్సుల్లోని రోగుల ప్రాణాలు నిలబెట్టి!