Spurious Cotton Seeds Gang Arrest : నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు అక్రమంగా అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కోడిదాణా సరఫరా ముసుగులో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను చేరవేస్తున్నట్లు గుర్తించారు. చౌటుప్పల్ సమీపంలో నిందితుల నుంచి 70 లక్షల విలువైన 2.2 టన్నుల బీటీ-3 విత్తనాలు, కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నరసింహులు వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రవీంద్రబాబు ఏపీలోని మైలవరానికి చెందిన ప్రసన్నకుమార్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన రావి ప్రసన్నకుమార్ 20 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లా చౌటుప్పల్ పట్టణానికి వలస వచ్చారు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందుతున్న ఆయన... పదేళ్ల క్రితం నవత అగ్రో డివిజన్ పేరుతో చౌటుప్పల్లోనే ఎరువులు, విత్తనాల దుకాణం ప్రారంభించాడు. మరో నిందితుడు ఏపీలోని పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన గడ్డం రవీంద్రబాబు ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కుహి గ్రామానికి వలస వెళ్లారు. స్థానికంగా 60 ఎకరాల భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంతోపాటు అడ్డదారుల్లో ఎలాగైనా డబ్బును సంపాదించాలన్న లక్ష్యంతో నిషేధిత బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి అవసరమున్న వారికి విక్రయించడం మొదలు పెట్టాడని పోలీసులు వివరించారు.
ప్రీమియం చికెన్ ఫీడ్ పేరుతో నకిలీ విత్తన దందా : 8 ఏళ్లుగా మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కుహి గ్రామంలో స్థిరపడ్డ రవీంద్రబాబు... అక్కడి రైతులు, వ్యాపారులకు నకిలీ విత్తనాలు సరఫరా చేశాడు. ఐదేళ్ల నుంచి ఎవరికీ అనుమానం రాకుండా ప్రీమియం చికెన్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బస్తాల్లో విత్తనాలు నింపి, నరసింహులు 5 రాష్ట్రాలకు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పత్తి సాగు సీజన్ మొదలుకాగానే రాత్రివేళ సరకు రవాణా చేస్తూ, రైతులకు రెట్టింపు ధరకు విక్రయించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ వెల్లడించారు.
పోలీసులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పట్టుబడ్డ హెచ్‌టీ కాటన్ సాగుకు దేశంలో అనుమతి లేదు. ఆ విత్తనాల వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. ప్యాకెట్లుగా కాకుండా విడిగా అమ్మే పత్తి విత్తనాల కొనుగోలు విషయంలోనూ... రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని చౌటుప్పల్ సహా కొన్ని ప్రాంతాల్లో నిషేధిత విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు... తొలుత ఆ ముఠా వద్ద కేవలం 24 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానంతో నిఘాపెట్టిన పోలీసులు చిత్తూరు, నాగ్‌పూర్‌లో నుంచి రహస్యంగా వివరాలు సేకరించి అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి :