ఖైదీల్లో సత్ప్రవర్తనే లక్ష్యంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును ఐజీ సైదయ్య ప్రారంభించారు. క్షణికావేశంలో, పరిస్థితుల ప్రభావం వల్ల నేరం చేసి జైలుకు వచ్చిన ఖైదీలు సన్మార్గంలో నడిచేందుకు వారికి ఉపాధి కల్పిస్తున్నామని ఐజీ అన్నారు. ప్రభుత్వం సహకారంతో జైళ్ల శాఖ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు జైళ్ల శాఖ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 29 బంకులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ప్రతి బంకు నుంచి నెలకు రూ. 10లక్షల ఆదాయం సమకూర్చడమే కాకుండా శిక్ష అనుభవిస్తున్న, విడుదల అయిన ఖైదీలకు బంకుల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు సైదయ్య వెల్లడించారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు నెలకు రూ. 3 వేలు, విడుదలైన ఖైదీలకు జిల్లాలో రూ.12 వేలు, మెట్రో నగరాల్లో రూ. 15వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పెట్రోల్ బంకుల్లో 500 మంది.. విడుదలైన ఖైదీలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ లాంటి పలు పట్టణాల్లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో బంకుల నిర్వహణ జరుగుతోందని వివరించారు. అంతే కాకుండా కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలకు మాస్కులు, శానిటైజర్లను నాణ్యతతో తయారు చేసి అమ్ముతున్నామని చెప్పారు. లాభాల కంటే ముఖ్యంగా ఖైదీలలో సత్ప్రవర్తన, మంచి ఉపాధి కల్పించాలనే దిశగా జైళ్ల శాఖ అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిని ప్రజలు ఆదరించాలని కోరారు.
ఇదీ చదవండి: అదుపు తప్పి కోడిగుడ్ల లారీ బోల్తా.. రూ. 10లక్షల ఆస్తి నష్టం