ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా మార్చి 22 నుంచి మద్యం దుకాణాలు మూసి ఉన్నాయి. మద్యం దొరకకపోవడంతో చాలామంది ఈ అలవాటును మానుకుంటున్నారు. ఈ నెల 17 అనంతరం కేంద్రం లాక్‌డౌన్ ఎత్తేసినా ఈ అలవాటుకు దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ నిలదొక్కుకోగలరు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 277 మద్యం దుకాణాలు, 29 బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. ఇందులో నెలకు సగటున రూ.1200 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఉమ్మడి నల్గొండలో 11 లక్షల కుటుంబాలున్నాయి. అంటే సగటున ఒక కుటుంబం నెలకు రూ.10 వేల వరకు ఒక్క మద్యపానానికే ఖర్చు చేస్తోంది. లాక్‌డౌన్ తర్వాతా మందు అలవాటును మానుకున్నట్లయితే డబ్బు ఆదాతో పాటు కుటుంబ కలహాలు, ఆర్థిక కష్టాలు దూరమైనట్లే.
ప్రమాదాలకు లాక్
ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో తరుచూ వినిపిస్తున్న మాట ‘‘అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి’’. లాక్‌డౌన్ అనంతరమూ అత్యవరమైతేనే బయటకు వెళ్లండి. దీని వల్ల నెలన్నర కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాలు తగ్గాయి. రాష్ట్రంలోనే అత్యధిక కి.మీ. జాతీయ, రాష్ట్ర రహదారులున్న ఉమ్మడి నల్గొండలో సాధారణ రోజుల్లో నెలకు 700 నుంచి 800 రహదారి ప్రమాదాలు జరిగేవి. ఇందులో సగటున బలహీనపక్షం 150 నుంచి 180 మంది వరకు ప్రాణాలు కోల్పోయేవారు. 250 మంది గాయపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాక్‌డౌన్ తర్వాత అత్యవసరమైతేనే బయటకు వెళితే మీ కుటుంబాలను కాపాడుకున్నవారవుతారు.
ఖర్చు డౌన్
చిన్న, చిన్న కారణాలు, అనారోగ్యాలకు ఆసుపత్రులకు వెళ్లేవారు ప్రస్తుత కాలంలో ఎక్కువయ్యారు. ఇదే అదనుగా చాలా కార్పొరేట్ ఆసుపత్రులతో మొదలుపెడితే చిన్న చిన్న క్లినిక్‌లు సైతం ప్రజల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 600 వరకు ఆసుపత్రులుండగా... ఇందులో సర్జరీలు చేసే కార్పొరేట్ దవాఖానాలు 60 వరకు ఉంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వైద్య వ్యాపారం నెలకు రూ.100 కోట్లకు పైగానే జరుగుతోంది. పెద్ద వ్యాధివస్తే తప్ప చిన్నచిన్న అనారోగ్యాలకు ఇంట్లోనే నయం చేసుకుంటే తప్ప ప్రస్తుత సంక్షోభాన్ని భవిష్యత్తులోనూ సమర్థంగా ఎదుర్కోలేం. అందుకే ఈ నెలన్నర రోజుల పాటూ పాటించిన ఈ అలవాటును నిరంతరం అనుసరించాల్సిందే.
ఇంధనం
నిత్యావసరాల తర్వాత సగటు వేతన జీవికి నెలలో అత్యధికంగా ఖర్చయ్యేది ఇంధనానికే. ప్రస్తుతం ఎక్కడా కార్యాలయాలు లేకపోవడం, నిత్యావసరాలు, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడంతో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గింది. ఫలితంగానేసహజంగానే ఖర్చు తగ్గుతుంది. ఉమ్మడి నల్గొండలో మూడు చక్రాలు, ఆపైనా సుమారు 5 లక్షల వాహనాలు ఉండగా... ద్విచక్ర వాహనాలు మూడున్నర లక్షల వరకు ఉన్నాయి. వీటికి సరకు రవాణా వాహనాలు అదనం. సాధారణ రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని 300 పెట్రోల్ బంకుల్లో దాదాపు 11 లక్షల లీటర్ల పెట్రోల్, 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం ఉండేది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కలిపి లక్ష లీటర్ల వినియోగం కూడా కావడం లేదు. మరోవైపు రహదారులపై పోలీసులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో చిన్న చిన్న దూరాలకు ప్రజలు నడిచే వెళుతున్నారు. ఇదే అలవాటును లాక్‌డౌన్ తరువాత కొనసాగిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆర్థికంగానూ పొదుపు మంత్రం.
బలపడుతున్న కుటుంబ బంధాలు
సంపాదనే ధ్యేయంగా గజిబిజి బతుకుల ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ కుటుంబ బంధాలను పెంచే ఆయుధమయింది. చాలామంది ఇంట్లోనే ఉంటూ పిల్లలు, పెద్దలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. లాక్‌డౌన్ సడలింపు అనంతరమూ ఉద్యోగం, కుటుంబ జీవితాలను సమన్వయం చేసుకుంటే అనేక ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారుగా ప్రభుత్వ ఉద్యోగులు 40 వేల వరకు ఉండగా... ప్రైవేటు ఉద్యోగులు లక్షన్నర వరకు ఉంటారు. వివిధ కార్ఖానాలలో పనిచేసే కార్మికులు వీరికి అదనం. వీరంతా ప్రస్తుతం పనుల్లేకపోవడంతో కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు.