రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణ మార్పుతో సీజనల్ వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది. నిత్యం 8 వందల మందికి పైగా రోగులు జ్వరాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరుతున్నారు. ఈ సీజన్లో 91 మందికి డెంగ్యూ నిర్ధరణ కాగా... మలేరియా, చికున్ గన్యా, పైలేరియాతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాలో తగిన సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
నేలపైనే వైద్యం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విషజ్వరాల విజృంభణతో జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోని మెడికల్ వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో 90 పడకల సామర్థ్యముంటే... ఇన్ పేషంట్ల సంఖ్య 150కి పైగా ఉంటోంది. సరైన రీతిలో వసతి సౌకర్యం లేక కొందరు రోగులకు నేల పైనే వైద్యం అందిస్తున్నారు. ఒకేసారి స్థాయికి మించి రోగులు రావడం వల్ల మందుల సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
డెంగ్యూ కేసులే అధికం
జిల్లా వ్యాప్తంగా 91 మందికి డెంగ్యూ నిర్ధరణ కాగా... మరో 197 మంది ఈ లక్షణాలతో బాధ పడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే లెక్కల్లోకి రాని వారి సంఖ్య ఇంకా ఎక్కువ గానే ఉంటుంది. జ్వర పీడితుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ వార్డులు సరిపోకపోవడం వల్ల పక్క వార్డుల్లో కూడా వైద్యం అందిస్తున్నారు. ఎంతమంది వచ్చినా... వారిని బయటకు పంపకుండా అందరికీ వైద్యం అందిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. డెంగ్యూ లక్షణాలతో ఉన్న వారికి ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నామని అంటున్నారు.
సిబ్బంది కొరత తీవ్రం
నల్గొండ ప్రస్తుతం వార్డుల్లో నర్సులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. వైద్య కళాశాల రాకతో సేవలు పెరిగినా... రెగ్యులర్ సిబ్బంది విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 50 మంది వరకు రోగులు ఉన్న వార్డుల్లో ఒక్క నర్సు మాత్రమే సేవలందిస్తున్నారు. మిర్యాలగూడ, దేవరకొండ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలున్నా... వైద్య సేవల్లో నిర్లక్ష్యం వల్ల జనం నల్గొండ దవాఖానాకే వస్తున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు పెంచాలని ఆసుపత్రి విభాగ అధిపతులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 500 పడకలు ఉండగా... వాటిని 1000 పడకలుగా మార్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సౌకర్యాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మందికి సేవలందించే అవకాశముంటుందన్న భావన అటు ప్రజలు, ఇటు వైద్యుల్లోనూ కనబడుతోంది.
ఇదీ చూడండి : తెలంగాణ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు