Best panchayat in nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో నూతనంగా ఏర్పడ్డ శ్రీనివాస్ నగర్ గ్రామపంచాయతీ అనతికాలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తింపుసాధించింది. సర్పంచ్ వెంకటరమణ, గ్రామస్తుల సహకారంతో... గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులను నూటికి నూరు శాతం ఏర్పాటుచేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గతంలో ఈ గ్రామం తుంగపాడు పంచాయతీలో విలీనంగా ఉండేది. గ్రామానికి మొట్టమొదటిసారి పంచాయతీ ఎన్నికలు జరిగే వేళ...ఊరు పెద్ద మనుషులు మాట్లాడుకుని వెంకటరమణను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికైన సర్పంచ్.. తన కార్యవర్గంతో కలిసి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లె ప్రకృతి వనం వంటి వాటిలో.. ప్రజలను భాగస్వామ్యం చేసి మొక్కలను పెంచారు. పల్లె ప్రకృతి వనంలో పూలు, అన్ని రకాల పండ్ల చెట్లను నాటి...ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు.
శిక్షణ.. ఉపాధి..
ఉపాధి హామీ పనుల్లో భాగంగా వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి వాటిల్లో సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ... వాటిని అమ్మి గ్రామానికి నిధులను సమకూర్చుతున్నారు. గ్రామ అభివృద్ధి చూసిన జిల్లా కలెక్టర్... గ్రామపంచాయతీ భవనాన్ని మంజూరు చేశారు. భూమిని దాతల సహాయంతో సేకరించి ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మించారు. అక్కడ స్కిల్ డెవలప్ సెంటర్ పేరిట అనేక మంది మహిళలకు... వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పించి.. ఉపాధి చూపుతున్నారు.
ఓపెన్ జిమ్, గ్రంథాలయం..
గ్రామ మౌలిక వసతులైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచి నీటి సౌకర్యం వంటివి కల్పిస్తూనే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉండేలా చొరవ తీసుకున్నారు. ఎక్కడాలేని విధంగా గ్రామంలో సొంత నిధులతో ఓపెన్ జిమ్, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. యువతీ, యువకులు ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. శారీరక దృఢత్వాన్ని పొందుతున్నారు. నిరుద్యోగ యువత గ్రంథాలయంలో ఉన్న పోటీ పరీక్షల పుస్తకాలు చదువుతూ... వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీని... అభివృద్ధి పథంలో ఉరుకులుపెట్టిస్తున్న సర్పంచ్ వెంకట రమణ.. మరెందరో ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిదాయకం.
ఇదీచూడండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు!