ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లన్నీ చాలా సులభంగా, పారదర్శకంగా జరుగుతున్నాయని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలోని 31 మండలాల్లో మొత్తం 165 రిజిస్ట్రేషన్లు పూర్తి అయినట్లు తెలిపారు.
ధరణి పోర్టులో ఇతరులెవరూ.. అధికారుల ప్రమేయంతో రిజిస్ట్రేషన్ ఆపలేరని స్పష్టం చేశారు.అలాంటి అపోహలు మానుకోవాలని సూచించారు.దీనిపై ఎవరైనా తప్పుదోవ పట్టించినా...తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినా అధికారులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశం ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ రంగనాథ్ స్వయంగా రెండో రిజిస్ట్రేషన్ కేసును పర్యవేక్షించారు. ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు మ్యుటేషన్లు పూర్తి చేసుకోని భూ యజమానులందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన అప్రమత్తం చేసినట్లయింది.
అరెస్ట్.. రిమాండ్.. ఉద్యోగులపై వేటు
నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి 2019లో 1.34 ఎకరాల భూమిని జగదీశ్ అనే వ్యక్తికి విక్రయించగా ఆయన మ్యుటేషన్ చేయించుకోలేదు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆమె ఈ నెల నాలుగో తేదీన ధరణి పోర్టల్ ద్వారా తిరిగి తన కుమార్తె పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. దీన్ని తెలుసుకున్న జగదీశ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమం వెలుగు చూసింది. ఈ ఘటనపై శుక్రవారం నల్గొండ కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రెండో రిజిస్ట్రేషన్ చేసిన విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు ఈ భూ వ్యవహారం వెనుక ఉన్న వివరాలను తెలిపారు. 2016లో విజయలక్ష్మికి చెందిన వ్యవసాయ భూమిని నాలా కింద వ్యవసాయేతర భూమిగా అధికారులు మార్చారు. దీంతో ఈ భూమికి పాసుపుస్తకం రాదు. దానికనుగుణంగా రెవెన్యూ రికార్డుల్లో కూడా మార్పులు చేయాలి. కానీ సాగుభూమిగానే చూపుతూ పాత యజమాని పేరుపై పాసుపుస్తకం జారీ చేసి అధికారులు ధరణిలో ఎక్కించారు. దీంతో ధరణి వేదికగా పాత యజమాని తేలికగా రెండో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అధికారులు వివరించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన నాటి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామాంజనేయులు, వీఆర్వో ఎండీ నిరంజన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. నాడు తహసీల్దారుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మహ్మద్ సమద్‌పై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేశారు. తప్పులు చేసుకుంటూ చట్టం గురించి తెలియదని బుకాయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ల విషయంలో అక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: నల్గొండలో కాంగ్రెస్ ధర్నా భగ్నం.. పలువురు నేతలు అరెస్ట్