Ministers on Munugode Bypoll Result: తెలంగాణ సమాజం తెరాస పక్షానే ఉందని మరోసారి రుజువైందని మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, భాజపా కుట్రలకు మధ్య జరిగిన పోరాటంలో తెరాస పక్షాన నిలిచిన మునుగోడు ప్రజలకు మంత్రి హరీశ్ ధన్యవాదాలు తెలిపారు. భాజపా అహంకారాన్ని మునుగోడు ప్రజలు అణచివేశారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పునకు మునుగోడు ఫలితం నాంది పలికిందన్నారు.
భాజపా కేంద్ర నాయకత్వానికి కర్రు కాల్చి వాతపెట్టారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలంతా భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. సీపీఎం, సీపీఐ పార్టీలు మునుగోడులో ఇచ్చిన మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తెరాస గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.
భాజపాకి ఓటుతో మునుగోడు ప్రజలు గుణ పాఠం చెప్పారు.. మునుగోడు ఉప ఎన్నికలో భాజపాపై బీఆర్ఎస్ తొలి విజయం సాధించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయ జైత్ర యాత్రకు ఓటు రూపంలో మద్దతు పలికి మునుగోడు ప్రజలు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్న వేముల ప్రశాంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ఉందని మరోసారి రుజువైందన్నారు.
కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష అని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాలను కూల దోసే కుట్రలు చేస్తున్న భాజపాకి ఓటుతో మునుగోడు ప్రజలు గుణ పాఠం చెప్పారని స్పష్టం చేశారు. గుజరాత్ గులాంలకు తెలంగాణ సలాం చేయదని తేల్చి చెప్పిన విజయమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా తెలంగాణలో కారు జోరు కోనసాగుతుందని తెలిపారు.
ఇవీ చదవండి: