ktr Nalgonda tour : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో నల్గొండ జిల్లాకు మహార్దశ పట్టనుంది. నేడు నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొన్ని రోజుల క్రితం నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.... సిద్దిపేట, గజ్వేల్ తరహాలో నల్గొండను అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. అందుకు అనుగుణంగా పట్టణంలో మౌలిక సౌకర్యాల కల్పన, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ముగ్గురు మంత్రులు నల్గొండకు విచ్చేస్తున్నారు. తొలుత ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటి హబ్ తోపాటు ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల నిర్మాణాలు,సమీకృత మార్కెట్ సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు.
నల్గొండలో ముగ్గురు మంత్రులు పాదయాత్ర నిర్వహించనున్నారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, వరద కాలువ నిర్మాణం, రోడ్ల విస్తరణ, ఫుట్ పాత్ నిర్మాణం, పార్కుల అభివృద్ధితో పాటు రింగ్ రోడ్డు , జంక్షన్ల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి పనులతోపాటు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పాతబస్తీ మీదగా ఈద్గా వరకు రోడ్డు విస్తరణ, ఉదయ సముద్రం ప్రాజెక్టు, మినీ ట్యాంక్ బండ్ దాని కింది భాగం నిర్మాణాలు, శిల్పారామం లాంటి పనులను గుర్తించి వాటి నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించే విధంగా జిల్లా యంత్రాంగానికి సూచనలు చేయనున్నారు.
రూ.500 కోట్లతో ప్రతిపాదనలు...
సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటనకు వచ్చిన సందర్భంగా నల్గొండ రూపురేఖలు మార్చాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనలతో మున్సిపాలిటీ, ఆర్అండ్బీ, విద్యుత్, ప్రజా ఆరోగ్యం శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రాథమిక అంచనాలు తయారు చేసినట్లు సమాచారం. అందులో మార్కెట్లు, రోడ్లు, వీధి దీపాలు, డివైడర్లు నిర్మాణం జంక్షన్ సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిసింది.
మున్సిపాలిటీలపై సమీక్ష...
నల్గొండ మున్సిపాలిటీతోపాటు జిల్లాలోనే మిర్యాలగూడ, దేవరకొండ, చండూరు, చిట్యాల, హాలియా, నందికొండ, నగరికల్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. నాగార్జునసాగర్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలకు వరాల జల్లు కురిపించిన నేపథ్యంలో నిధులు మంజూరు.. ఇంతకుముందు ప్రకటించిన టీయూ ఎఫ్ఐడీసీ నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉంది. ఉన్నది. పురపాలికల్లో సిబ్బంది ఖాళీలు ఇతర సమస్యలపై ఆరా తీసే అవకాశం ఉంది. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
ఇదీ చూడండి: CM KCR Review: 'నల్గొండను అభివృద్ధి చేసేదాకా నిద్రపోవద్దు'